బంగ్లాదేశ్ పరిణామాలపై సీపీఐ(ఎం) ఆందోళన
న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో ఇటీవల నెలకొన్న పరిణామాలపై సీపీఐ(ఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా సంస్థలపై, మైనారిటీలపై జరుగుతున్న దాడులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజల హక్కులను కాపాడే చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. ‘పేరొందిన రెండు సాంస్కృతిక సంస్థలు ఛాయనత్, ఉడిచిలపై దారుణమైన దాడి జరిగింది. మతం పేరుతో మైనారిటీలపై, తమకు అనుకూలంగా లేని మీడియా సంస్థలపై దాడుల ద్వారా సమాజాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తూ బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాద శక్తులు తమ ప్రభావాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది” అని పేర్కొంది. మత ఛాందసవాద శక్తులు పెరగడం వల్ల కేవలం బంగ్లాదేశ్‌పైనే కాకుండా మొత్తంగా ఈ ప్రాంతమంతటిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సరిహద్దుకు ఇరువైపులా గల మతోన్మాద శక్తులు పరస్పరం రెచ్చగొట్టుకుంటూ విద్వేషాన్ని మరింత రెచ్చగొట్టేందుకు ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకోవచ్చని పొలిట్‌బ్యూరో తెలిపింది. సామాజిక సామరస్యతను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం ప్రస్తుతం అవసరమని స్పష్టం చేసింది. ఈ పరీక్షా సమయంలో బంగ్లాదేశ్ ప్రజలు సమైక్యంగా ఉండి, 1971 నాటి విముక్తి పోరాట విలువలను పరిరక్షించగలరని సీపీఐ(ఎం) బలంగా విశ్వసిస్తోంది. మతోన్మాద శక్తులను నియంత్రించేందుకు, హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు అవసరమైన కార్యాచరణను తక్షణమే తాత్కాలిక ప్రభుత్వం చేపట్టాలని పొలిట్‌బ్యూరో కోరింది. అలాగే ఎలాంటి భయం లేకుండా ప్రజలు తమ భావాలను వెల్లడించేందుకు అనుమతిస్తూ, స్వేచ్ఛా, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని కోరింది.
మత ఛాందసవాద శక్తులను నియంత్రించాలి
- Advertisement -
- Advertisement -



