– శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై పెట్రోల్ బంక్ యజమాన్యం నిర్వాకం
– పంచాయతీరాజ్ శాఖ నిశ్శబ్దం
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం వెల్టూరు పరిధిలోని శ్రీశైలం–హైదరాబాద్ నేషనల్ హైవే పై నూతనంగా నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చెట్లను తొలగించే దుస్థితి నెలకొంది. గత సంవత్సరాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెంట నాటిన మొక్కలు పెద్దవిగా పెరిగిన నేపథ్యంలో, బంక్ యాజమాన్యం జెసిబి సహాయంతో మంగళవారం సుమారు 50 చెట్లను రోడ్డు పక్కల నుంచి తొలగించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
స్థానిక గ్రామపంచాయతీ లేదా మండల అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా చెట్లను తొలగించడం పర్యావరణానికి తీరని నష్టం కలిగిస్తోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో నాటిన హరితహారం మొక్కలను నిర్మాణాల పేరుతో తొలగించడం ప్రజాధనానికి గండి కొట్టడమేనని విమర్శిస్తున్నారు.
ఒక చెట్టు పెంచితే పర్యావరణం కాపాడబడుతుందనే అవగాహన ఉన్నప్పటికీ, వాటినే తొలగించడం ద్వారా ప్రకృతిపై నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారని పలువురు మండిపడ్డారు. ఈ ఘటనపై గ్రామపంచాయతీ, మండల అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, నేషనల్ హైవేపై ఇలాంటి చర్యలు బట్టబయలవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ అంశంపై స్పందించిన బంక్ నిర్వాహకులు నేషనల్ హైవే అధికారుల నుంచి చెట్లు తొలగించేందుకు అనుమతులు తీసుకున్నామని చెబుతున్నారు. అయితే, అనుమతి పత్రాలు చూపాలని కోరగా పర్మిషన్ పత్రాలు సమర్పించకపోవడంతో, అనుమతులు లేనట్టే ఈ చర్యలు చేపట్టినట్లు బట్టబయలవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, చెట్ల తొలగింపుకు ఉన్న అనుమతులపై స్పష్టత ఇవ్వాలని, పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.



