నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా ఒకే చోట సేవలను అందించడానికి వీలుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడం (రీఆర్గనైజేషన్)తో పాటు కార్పోరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించాలని నిర్ణయించింది. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ, కొత్త బిల్డింగ్ ల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. అంతిమంగా ప్రజల సంతృప్తే ప్రధానమనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పునర్వ్యవస్ధీకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని, మిగిలినవన్నీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడానికి అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో దశలవారీగా నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో నాలుగు లేదా ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకే చోట ఇంటిగ్రేటెడ్ కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
హైదరాబాద్ జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను రెండు చోట్ల, రంగారెడ్డి జిల్లాలో 14కు గాను మూడు చోట్ల , మేడ్చల్ జిల్లాలో 12కు గాను మూడు చోట్ల, సంగారెడ్డి, పఠాన్‌చెరువు కలపి ఒకటి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో కార్పోరేట్ స్ధాయిలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భవనాలను నిర్మించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటి గ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ సులభమవుతుందని అవినీతిని కూడా తగ్గించవచ్చని, కార్యాలయాల మధ్య పనిభారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్ వేగవంతం అవుతుందన్నారు.
మొదటగా హైదరాబాద్‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను, గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ (తాలిమ్) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి ఈ బిల్డింగ్ నమూనాకు తుది రూపునిస్తామని, వీలైనంత త్వరితగతిన ఈ భవనానికి శంకుస్ధాపన చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.