Wednesday, October 29, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలు'సుందిళ్ల'కు రిపేర్లు చేయండి

‘సుందిళ్ల’కు రిపేర్లు చేయండి

- Advertisement -

తుమ్మిడిహెట్టి నుంచి 80 టీఎమ్‌సీల నీటి తరలింపునకు ప్రణాళికలు
అన్ని డ్యాములపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలి : కేంద్రమంత్రి లేఖపై ముఖ్యమంత్రి సమీక్ష

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని అన్ని డ్యాములపై స్టేటస్‌ రిపోర్టులు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. నవంబర్‌ రెండో వారంలో వాటన్నింటిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. మంగళవారం నాడాయన నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎమ్‌సీల నీటిని తరలించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగు, తాగు నీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలనీ, దానికి పాత పనులను ఉపయోగించుకుంటూనే ముందుకు వెళ్లేలా అంచనాలు తయారు చేయాలని చెప్పారు. సుందిళ్లను మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చి, అటునుంచి శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేలా అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఇటీవల సీఎం రేవంత్‌రెడి రాసిన లేఖపై కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ రాసిన ప్రత్యుత్తరంపై సమీక్ష జరిపారు. సదరు లేఖలో పేర్కొన్నట్లు ప్రాజెక్టువారీగా అనాలసిస్‌ చేసి పూర్తిస్థాయి నివేదికలు తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లపై స్టేటస్‌ రిపోర్ట్‌ తయారు చేయాలన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పరిస్థితిపైనా సమీక్షించారు. బ్యారేజీల రిపేర్లకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలనీ దానికి సంబందిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ మాణిక్‌ రాజ్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సీఎం సంతాపం
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు.వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే హరీశ్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

శంకరమఠంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌ నల్లకుంట శంకర్‌మఠంను ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సందర్శించారు. అక్కడి గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కూడా ఉన్నారు. అనంతరం అక్కడే శృంగేరి పీఠాధిపతులు విధుశేఖర భారతీస్వామి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఆలయ అభివృద్ధితో పాటు హిందూ ధర్మ ప్రచారంపై వారితో చర్చించారు. భారతీస్వామి ‘ధర్మ విజయ యాత్ర’లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని రాష్ట్ర అతిధిగా గుర్తించి, ప్రభుత్వం ప్రోటోకాల్‌ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను సీఎం భారతీస్వామికి వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -