ప్రయివేటుపరం చేసేందుకే ఐఒఐల పేరిట ముక్కలుగా విభజన : ఎంఎ బేబీ
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు గాజువాకలో మహా ప్రదర్శన, సభ
విశాఖపట్నం : భారతదేశం గర్వించదగ్గ నవరత్న పరిశ్రమల్లో ఒకటైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్ (ఇఒఐ)ల పేరుతో ముక్కలు ముక్కలుగా చేసి ప్రయివేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను విశాఖ ప్రజలంతా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి హెచ్చరిక పంపాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబీ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం విశాఖలోని కొత్త గాజువాక కూడలి నుంచి పాత గాజువాకలోని వంటిల్లు జంక్షన్ వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యాన మహా ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన సభలో బేబీ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని నరేంద్ర మోడీ, రాష్ట్రంలోని చంద్రబాబు లూటీ చేసి అదాని, అంబానిలకు అప్పగించాలని చూస్తున్నారని తెలిపారు. ఉద్యమ నేత సీతారాం ఏచూరి తొలి వర్థంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని, అందుకు విశాఖపట్నం అంతా ప్రతినబూనాలని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించే సభకు తనకు ఆహ్వానం అందిన వెంటనే దేశంలోని ఇతర స్టీల్‌ప్లాంట్ల పరిస్థితిని పరిశీలించానని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశంలోనే గర్వించదగ్గ నవరత్న సంస్థలలో ఒకటని తెలిపారు. దానిని ప్రయివేటీకరించి కార్పొరేట్లకు లాభం చేకూర్చాలని కేంద్రం చూడడం దుర్మార్గమన్నారు.
దేశంలోనే తొలి ఐఎస్‌ఒ సర్టిఫికేషన్ కలిగిన సంస్థ వైజాగ్ స్టీల్‌ప్లాంట్ అని, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సముద్ర తీరాన సీ పోర్టు కలిగిన ఏకైక కర్మాగారమని గుర్తు చేశారు. నవరత్న సంస్థలకు సహకారం అందించాల్సిన కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండడం దారుణమన్నారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా, రా మెటీరియల్ ఇవ్వకుండా నష్టాల బారినపడే విధంగా కుట్ర పన్నుతోందని వివరించారు. మోడీ, అమిత్ షాతోపాటు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు మోహన్ భగత్ కలిసి కుట్రలో భాగమయ్యారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మడానికి వీలులేదనే హెచ్చరికను ఈ మహా ప్రదర్శన, బహిరంగ సభ ద్వారా కేందానికి పంపుతున్నామన్నారు. కేరళ రాష్ట్రంలోని వల్లూరు హిందుస్థాన్ న్యూస్ ప్రింట్ సంస్థను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటిస్తే… దానిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకు వచ్చిందని, అలా ఇక్కడి స్టీల్‌ప్లాంట్‌ను నడపగలిగే సత్తా ఎపి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని చంద్రబాబును బేబీ ప్రశ్నించారు. దేశంలో సమస్యలన్నిటినీ పక్కనపెట్టి కేంద్రం అదాని, అంబానిల కోసం పనిచేస్తోందన్నారు. ప్రజలంతా ఒక్కటై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.