నవతెలంగాణ – జన్నారం : మండలం మీదుగా భారీ వాహనాలను అనుమతించాలని సామాజిక కార్యకర్తలు శ్రీరాముల భూమాచారి, బద్రీ నాయక్ ల ఆధ్వర్యంలో సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఇరువైపులా కొంత సేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవ్వాల్ టైగర్ జోన్ పేరిట విధించిన ఆంక్షల వలన మండల అభివృద్ధి కుంటుపడుతుందని, మండల వాసులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ ఆంక్షలు తొలగించి మండలం మీదుగా ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల ప్రజలు అంబేద్కర్ విగ్రహం నుండి అటవీశాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎఫ్.డి.ఓ రామ్మోహన్ కు వినతిపత్రం అందజేశారు. భారీ వాహనాలను అనుమతించేలా అధికార యంత్రంగానికి డిమాండ్ ను తెలియజేయాలని కోరారు.
కిందిస్థాయి అధికారుల చేతుల్లో లేదని, గతంలో ఇచ్చిన వినతిపత్రాలను పైఅధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు. మరల ఇట్టి సమస్యను పైస్థాయి అధికారులకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. సమస్య పరిష్కారం కానీ యెడల అటవీశాఖ ఉద్యోగులనందు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడానికి వెనకడాబోమని మండల ప్రజలు అన్నారు. ఈ కార్యక్రమంలో కమ్మల విజయ ధర్మ, బెడద గోపాల్, పవన్, కృష్ణ, సుతారి వినయ్, భరత్ కుమార్, వొజ్జల వామన్, ద్యావరశెట్టి వాసు, కొమురవెల్లి సందీప్, దేవేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.