నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలోని కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఓ గ్రామం మొత్తం కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్ కు కేవలం 130మందిని రక్షించాయి. మరో 12 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌లో ఊర్లకు ఊర్లనే తుడిచి పెట్టుకు పోతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగి పడి ప్రజలు ప్రాణాలను వదిలేస్తున్నారు. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలీలోని కొండపై నుంచి ఒక్కసారిగా వచ్చిన వరద బురదతో ఆ గ్రామం మొత్తం కొట్టుకుపోయింది. ఈ ఘటనతో అక్కడ సుమారు 50 మందికి పైగా గల్లంతు కావడంతో పాటు తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది.
మరోవైపు ముంపు బాధితులను రక్షించడానికి విపత్తు దళాలు రంగంలోకి దిగాయి.భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) నేతృత్వంలో రక్షణ, సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.