శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శాసన మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ, శాసనమండలిలో సభ్యులు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలిప్పించాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉన్నతాధికారులకు సూచించారు. శాసనసభ, శాసనమండలి సమావేశాల నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై వారు రాష్ట్ర ప్రభుత్వ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో ఆదివారం శాసనసభ భవనంలోని కమిటీ హాలులో సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి కార్యదర్శి వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి ఆర్.తిరుపతి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఏడీజీపీ విజయకుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు విసి సజ్జనార్, అవినాష్ మహంతి, సుధీర్ బాబు, ఇంటెలిజెన్స్ ఐజీ కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గత సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమావేశాలు కూడా సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. ఆయా శాఖలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నప్పుడు సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రులకు, సభ్యులకు తగిన సమాచారం అందిస్తూ సహకరించాలన్నారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం తెలుసుకుని అడ్డుకోవాలన్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పని చేయాలని కోరారు. అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలన్నారు. ధర్నాలకు ఎక్కువగా పిలుపునిచ్చే అవకాశాలున్నాయనీ, ఛలో అసెంబ్లీ కార్యక్రమాలు జరగకుండా చూడాలని అప్రమత్తం చేశారు. సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.
సభ్యుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలిప్పించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


