Wednesday, July 23, 2025
E-PAPER
Homeజాతీయం'గడువు'పై స్పందించండి

‘గడువు’పై స్పందించండి

- Advertisement -

కేంద్ర రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
తదుపరి విచారణ 29కి వాయిదా
న్యూఢిల్లీ :
రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువు లోగా ఆమోదించాలంటూ న్యాయస్థానాలు నిర్దేశించవచ్చా అనే అంశంపై స్పందించాల్సిందిగా కేంద్రానికి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవారు నేతృత్వంలో న్యాయమూర్తులు సూర్యకాంత్‌, విక్రమ్‌ నాథ్‌, పీఎస్‌ నరసింహ, ఏఎస్‌ చందూర్కర్‌తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితమైన విషయం కాదని, మొత్తం దేశానికి సంబంధించిన విషయమని, సమాఖ్య నిర్మాణంపై విస్తృత ప్రభావం చూపుతుందని ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై స్పందించేందుకు కేంద్రానికి, రాష్ట్రాలకు వారం రోజులు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
‘రాజ్యాంగ నిబంధనలను అన్వయించుకునే విషయంలో కొన్ని అంశాలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో మాకు సహకరించవలసిందిగా అటార్నీ జనరల్‌ను కోరాం. కేంద్రానికి, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేస్తున్నాం. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-మెయిల్స్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలపవచ్చు. వచ్చే మంగళవారం విచారణ జరుగుతుంది’ అని న్యాయమూర్తులు తమ ఆదేశాలలో తెలియజేశారు. అంతకుముందు కొద్దిసేపు జరిగిన విచారణ సందర్భంగా కేరళ తరఫున కేకే వేణుగోపాల్‌, తమిళనాడు పక్షాన పి.విల్సన్‌ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరడాన్ని వారు వ్యతిరేకించారు. దాని చెల్లుబాటును ప్రశ్నించారు. అయితే తర్వాతి దశలో అభ్యంతరాలు లేవనెత్తవచ్చునని ప్రధాన న్యాయమూర్తి గవారు వారికి సూచించారు.
రాష్ట్రపతి పంపిన నివేదనపై ఆగస్ట్‌ మధ్య నుంచి వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 143 (1)ని ఉపయోగించుకోవడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేలో సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరిన విషయం తెలిసిందే. రాష్ట్రాలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో రాష్ట్రపతి, గవర్నర్లు నిర్వహించాల్సిన రాజ్యాంగపరమైన పాత్రపై చట్టపరమైన అభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్రపతి 14 కీలక ప్రశ్నలు సంధించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలలో రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 (1) కింద సుప్రీంకోర్టును సంప్రదించవచ్చు. దాని అభిప్రాయాన్ని కోరవచ్చు. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించిన కేసులో ఏప్రిల్‌ 8వ తేదీన సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచ్‌ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్రపతి అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరారు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్‌ తన వద్ద అట్టే పెట్టుకోవడం చట్టవిరుద్ధమని సుప్రీం బెంచ్‌ ఆ తీర్పులో పేర్కొంది.
ఆమోదం కోరుతూ గవర్నర్ల నుంచి బిల్లులు వచ్చినప్పుడు వాటిపై రాష్ట్రపతి మూడు నెలల లోగా చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు గతంలో సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని 200, 201 అధికరణలు నిర్వచించిన అధికారాలు, విధులను వేరు చేయడానికి సంబంధించి ఈ తీర్పు పలు రాజ్యాంగపరమైన అంశాలను లేవనెత్తింది. ఆర్టికల్‌ 200 ప్రకారం…శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఆమోదించవచ్చు. ఆమోదం తెలపకుండా అట్టే పెట్టుకోవచ్చు. లేకుంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. ఆర్టికల్‌ 201 ప్రకారం…ఏదైనా బిల్లు రాష్ట్రపతి పరిశీలనకు వచ్చినప్పుడు దానిపై చర్య తీసుకోవడానికి నిర్దిష్ట కాలపరిమితి అంటూ ఏదీ విధించలేదు. వీటిని బట్టి చూస్తే గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం కాలపరిమితిని నిర్దేశించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -