Monday, July 14, 2025
E-PAPER
Homeజాతీయంజమ్మూకాశ్మీర్‌లో ఆంక్షలు

జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షలు

- Advertisement -

మంత్రులు సహా ప్రముఖుల హౌస్‌ అరెస్టు
కేంద్రం తీరు సిగ్గుచేటు : సీఎం ఒమర్‌ అబ్దుల్లా
న్యూఢిల్లీ :
‘కాశ్మీర్‌ అమరవీరుల దినోత్సవం’ నిర్వహించకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ)మనోజ్‌ సిన్హా యంత్రాంగం జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షలు విధించింది. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు సహా ప్రతిపక్ష నేతలను గృహాల్లో నిర్బంధించింది. 1931 జులై 13న కాశ్మీర్‌లో రాజు హరిసింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లిం నిరసనకారులపై బ్రిటీష్‌ దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో 21మంది ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం ప్రతి ఏడాది జులై 13న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని ఎల్‌జీ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. అమరవీరుల శ్మశాన వాటికకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


వీరుల త్యాగాలను మరిచిపోలేం : సీఎం ఒమర్‌ అబ్దుల్లా
కాశ్మీర్‌ అమరవీరుల దినోత్సవం పాటించ కుండా పలువురు నేతలపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా యంత్రాంగం విధించిన గృహని ర్బంధాలు, ఆంక్షలను ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తీరు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”జులై 13న జరిగిన మారణహోమం జలియన్‌ వాలాబాగ్‌ లాంటిదే. అప్పట్లో కాశ్మీర్‌ బ్రిటీష్‌ నియంతృత్వం కింద ఉండేది. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన నిజమైన వీరులను ముస్లిములన్న కారణంతో నేడు విలన్లుగా చిత్రీకరించడం సిగ్గు చేటు. నేడు వారి సమాధులను సందర్శించే అవకాశం నిరాకరించారు. కానీ వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరిచిపోలేం’ అని ఆదివారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు.


అమరులకు నివాళులర్పించకుండా అడ్డుకున్నారు : సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎంవై తరిగామి
తనను గృహ నిర్బంధం చేశారని, తన నివాసం గేటుకు తాళం వేసి నిర్బంధించడం ద్వారా అమరులకు నివాళులర్పించే తమ హక్కును అడ్డుకున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, కుల్గాం ఎమ్మెల్యే ఎంవై తరిగామి సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. తన నివాసానికి తాళం వేసిన చిత్రాన్ని ఆయన పోస్ట్‌ చేశారు. ‘ఈ రోజు మనందరి సమిష్టి జ్ఞాపకాలలో అజరామరంగా నిలిచిపోయిన రోజు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, మన అందరికీ మంచి భవిష్యత్‌ ఇచ్చేందుకు తమ ప్రాణాలను అర్పించిన అత్యంత ముఖ్యులైన వారిని గుర్తు చేసే చారిత్రాత్మక రోజు’ అంటూ ఆయన అమరులకు నివాళులర్పించారు. తరిగామిని, ఇతరులను గృహ నిర్బంధం చేయడం ద్వారా అడ్డుకోవడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.


వాళ్లు ఎప్పుడూ మన హీరోలే : మెహబూబా ముఫ్తీ
”మహాత్మాగాంధీ నుంచి భగత్‌ సింగ్‌ వరకు కాశ్మీరీలు మీ హీరోలను స్వీకరించినట్లే మీరు మా హీరోలను మీ హీరోలుగా అంగీకరించిన రోజు” ప్రధాని మోడీ ప్రసంగించిన ‘దిల్‌ కి దూరి’ వాస్తవ రూపం దాల్చుతుందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ తెలిపారు. అమరుల సమాధులను సందర్శించకుండా ప్రజలను, నాయకులను వారి ఇండ్లలోనే నిర్బంధించడం శోచనీయమని అన్నారు. వారు ఎప్పటికీ మన హీరోలేనని అన్నారు. తనను గృహ నిర్బంధంలో ఉంచారని జమ్ముకాశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే సజాద్‌ లోని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -