లేకపోతే ఆగస్టులో పోరాటం తీవ్రతరం : టీయుఎంహెచ్‌ఇయూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పారామెడికల్ పోస్టుల ఫలితాలను ఈ నెలాఖరులోగా విడుదల చేసి, నియామకాలు చేపట్టాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్ర వారం హైదరాబాద్‌లోని మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన సీఎం ప్రజావాణిలో యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ నేతత్వంలో నిరుద్యోగ అభ్యర్థులు వినతిపత్రం సమర్పించారు. 2024లో విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు 1,284, నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులు 2,322 పోస్టులు, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 732, ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) పోస్టులు 1,931తో కలుపుకుని మొత్తం 6,269 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని వారు గుర్తుచేశారు. ఇవి కాకుండా ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు కోరారు. ఈ నోటిఫికేషన్లకు సంబంధించి రాతపరీక్షలు నిర్వహించి కీ విడుదల చేశారనీ, ప్రొవిజనల్ లిస్టులు విడుదల చేసి నియామకం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భూపాల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. త్వరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రజావాణి అధికారులు తమ వినతిని స్వీకరించి మెడికల్ బోర్డులో బాధ్యులతో మాట్లాడారనీ, ఫలితాల ఆలస్యానికి సరైన కారణాలను వారు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జులై ఆఖరు నాటికి ల్యాబ్ టెక్నీషియన్ల తుది మెరిట్ జాబితా, మరో వారంలో స్టాఫ్ నర్సులు, అనంతరం మరో వారంలో ఏఎన్‌ఎంలు, తర్వాత ఫార్మాసిస్టుల ప్రొవిజనల్ జాబితాలు విడుదల చేయనున్నట్టు మెడికల్ బోర్డు నుంచి తెలిపారని వివరించారు. ప్రభుత్వ విధానం మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నోటిఫికేషన్లతో నిరుద్యోగులను భ్రమ పెడతామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల్లో కొత్తగా నియమిస్తున్న వారిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాకుండా రెగ్యులర్‌గా తీసుకోవాలని కోరారు. జులై ఆఖరు వరకు వేచి చూస్తామనీ, అప్పటికీ ఫలితాలు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని భూపాల్ హెచ్చరించారు.
పారామెడికల్ పోస్టుల ఫలితాలు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES