Friday, January 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎన్నికల ముందు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి..

ఎన్నికల ముందు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వండి..

- Advertisement -

ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి వినూత్న నిరసన
దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగిన దంపతులు
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఘటన

నవతెలంగాణ- నార్కట్‌పల్లి
ఎన్నికల ముందు తన వద్ద డబ్బులు తీసుకుని ఓటు వేయని వారు తిరిగి ఆ డబ్బులు ఇవ్వాలని కోరుతూ ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 11 జరిగిన మొదటి విడత సర్పంచ్‌, వార్డు మెంబర్ల ఎన్నికల్లో భాగంగా ఔరవాణి గ్రామంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి కల్లూరి బాలరాజు ప్రచారంలో భాగంగా ఇంటింటికీ రూ.2,000 పంచాడు. డబ్బులు తీసుకున్న వారితో ఓటు వేస్తామని హామీ తీసుకున్నాడు. గెలుపు ఖాయమనుకొని ధీమాగా ఉన్న కల్లూరి బాలరాజుకు గ్రామంలో మొత్తం 1490 ఓట్లు ఉండగా.. 517 ఓట్లు పడ్డాయి. తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి జక్కల పరమేశ్‌కు 973 ఓట్లు పడగా 456 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.

దాంతో గ్రామస్తులు తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుని ఫొటో, పురుగు మందు డబ్బా పట్టుకొని తాను డబ్బులు ఇచ్చిన గ్రామస్తుల వద్దకు వెళ్లారు. ”మా వద్ద డబ్బులు తీసుకున్న వారు నిజంగా ఓటు వేసినా 10 నుంచి 20 ఓట్ల తేడాతో ఓడిపోతే.. అది సహజమని భావించే వాళ్లం.. కానీ డబ్బులు తీసుకొని మోసం చేశారు.. వాస్తవంగా ఓటు వేస్తే దేవుడిపై ప్రమాణం చేయాలి.. లేనిపక్షంలో మా డబ్బులు తిరిగి ఇవ్వాలి.. లేకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటాం” అని ఇంటింటికీ తిరిగారు. దీంతో గ్రామస్తులు అయోమయానికి గురయ్యారు. కొందరు డబ్బులు తిరిగి ఇచ్చినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -