Thursday, March 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసిద్దిపేటలో రేవంత్‌రెడ్డే పోటీచేయాలి

సిద్దిపేటలో రేవంత్‌రెడ్డే పోటీచేయాలి

- Advertisement -

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
అసెంబ్లీ సమావేశాలను వారం రోజులు పొడిగించాలి
ఆరు గ్యారంటీలను విస్మరించినందుకే చెవిలో పూలతో నిరసన : మీడియాతో చిట్‌చాట్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సిద్దిపేటలో ఎవరో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే తనపై పోటీ చేయాలని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తలకిందకు పెట్టి కాళ్లు పైకి పెట్టి తపస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లి వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేననీ, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్‌యేనని ధీమా వ్యకం చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. డీలిమిటేషన్‌ ఎపుడో జరగాలనీ, సీట్లు పెరిగి, మహిళా రిజర్వేషన్‌ అమలు జరిగితే స్వాగతిస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి బీఆర్‌ఎస్‌ గతంలోనే పంపించిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వంచించిందని అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ద్వారా తేటతెల్లమైందని అన్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు అతితక్కువ నిధులు అంటే రెండు శాతం ఖర్చు పెట్టిన కాంగ్రెస్‌ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌ అన్ని వర్గాలనూ నిరాశ పరిచిందన్నారు. ఆరు గ్యారంటీలను తుంగలో తొక్కింది కనుకే బడ్జెట్‌ ప్రతులను చింపి చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపామని వివరించారు. ఈ ప్రభుత్వనికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని చెప్పారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఈ ప్రభుత్వాన్ని అభినందించే వాళ్లమని అన్నారు. అసెంబ్లీ సమావేశాలను ఈనెల 30 తర్వాత మరో వారం రోజులు పొడిగించాలని డిమాండ్‌ చేశారు. అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరారు. సభ జరుగుతున్న తీరు అస్సలు బాలేదని అన్నారు.

అసెంబ్లీని నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. బుధవారం రెండు ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు రాకుండా చేశారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్న ప్రశ్నకు 16 నోటిఫికేషన్ల ద్వారా 16,978 ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం సమాధానం చెప్పిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో 50,785 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తే నియామక పత్రాలు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చి ఉద్యోగాలిచ్చినట్టు చెప్పుకుంటున్నదని చెప్పారు. ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు దక్షిణాది రాష్ట్రాలకు తక్కువగా వస్తున్నాయని అన్నారు. డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నామనీ, అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగడం వల్ల బీఆర్‌ఎస్‌కు లాభమేనని చెప్పారు. ఏ టైంలో గోల్‌ కొట్టాలో బీఆర్‌ఎస్‌కు బాగా తెలుసన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -