Saturday, November 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్‌

రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్‌

- Advertisement -

ఫీజులడిగితే కాలేజీలపై విజిలెన్స్‌ దాడులా?
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు
మీట్‌ ద ప్రెస్‌లో మాజీమంత్రి హరీశ్‌రావు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్‌ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆర్టీఐని ఉపయోగించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను బ్లాక్‌ చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌ రెండేండ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలనీ, ఓడించాలనీ, అప్పుడే ఆరు గ్యారంటీలు అమలవుతాయని వివరించారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టడానికి దోహదపడతుందన్నారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ (సోమాజిగూడ) ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాలుగు లక్షల మందికే పరిమితం కాదనీ, నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అని అన్నారు. ఈ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయనీ, పీఆర్సీ అమలు అమలు చేయడం లేదని చెప్పారు. కళ్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తామన్నారనీ, ఇప్పుడు ఇవ్వలేమంటున్నారని విమర్శించారు. తాము తొమ్మిదిన్నరేండ్లలో రూ.2.80 లక్షల కోట్లు అప్పు చేశామని అన్నారు. కాంగ్రెస్‌ రెండేండ్లలోనే రూ.2.08 లక్షల కోట్లు అప్పు చేసిందనీ, ఢిల్లీకి మూటలు మోయడం తప్ప చేసిన అభివృద్ధి ఏముందని అడిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు అడిగితే కాలేజీలపై విజిలెన్స్‌ దాడులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్‌ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కేసీఆర్‌ సమర్థవంతంగా నడిపారనీ, కరోనా సమయంలోనూ ఫీజులను చెల్లించామని గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రెండేండ్లు అవుతున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి నిధులను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చదువు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదనీ, ఫీజులు కట్టాలంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని చెప్పారు. ఈనెల మూడో తేదీ నుంచి కాలేజీలు నిరవధిక బంద్‌ చేపట్టాయనీ, విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి ఫీజు బకాయిలను విడుదల చేసి బంద్‌ను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందనీ, అందుకే ప్రజలను భయపెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయ్యకుంటే పథకాలు ఆగిపోతాయంటున్నారనీ, ఆ నిధులు రేవంత్‌రెడ్డి ఇంట్లో నుంచి ఇస్తున్నారా?అని ప్రశ్నించారు. రెండేండ్ల కాంగ్రెస్‌ అరాచక పాలనకు జూబ్లీహిల్స్‌ ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ గెలిస్తే మూడేండ్లు నరకయాతన అనుభవించాల్సి వస్తుందన్నారు. కేసీఆర్‌ పదేండ్ల పాలనలో వికాసం, రేవంత్‌ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమేనని విమర్శించారు. కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచినా హామీలను అమలు చేయబోరని చెప్పారు. కాంగ్రెస్‌ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్‌ ఆవిర్భవించక ముందే స్వాతంత్య్రం కోసం ముస్లింలు ఉద్యమించారని గుర్తు చేశారు. ముస్లింలకు ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే రేవంత్‌రెడ్డికి ఎన్టీఆర్‌, పీజేఆర్‌ గుర్తుకొచ్చారని అన్నారు. ఎన్టీవీ బ్యూరో చీఫ్‌ దొంతి రమేష్‌ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు విజరుకుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరికుప్పల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -