Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవెన్యూ అధికారులరా ప్రభుత్వ భూములను కాపాడండి..

రెవెన్యూ అధికారులరా ప్రభుత్వ భూములను కాపాడండి..

- Advertisement -

కాటారంలో అధికారులు ఉన్నట్టా లేనట్టా..
డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ – కాటారం

కాటారం మండల కేంద్రంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్ అన్నారు. కబ్జాలకు కేంద్రంగా కాటారం మిగిలిపోతుందని, ప్రభుత్వ ఖాళీ స్థలం భూములు ఎక్కడున్నా కబ్జాదారులు మాయం చేస్తున్నారని, అధికారులు మాత్రం ఏమీ తెలియనట్లు చోద్యం చూస్తున్నట్లుగా స్పష్టమవుతుందని అన్నారు. గతంలో ప్రభుత్వ స్థలాలు పోయినా అధికారులు ఇప్పటివరకు ఏ ఒక్క సెంటు భూములు కూడా తిరిగి సాధించలేని పరిస్థితి కాటారంలో నెలకొన్నదని అన్నారు.

ప్రస్తుతం మండల కేంద్రంలోని ఊర చెరువుకు అనుకొని ఉన్న శిఖం ఖాళీ స్థలం సర్వే నెంబర్ 71 లో కబ్జాకు గురవుతుందని, గతంలో సబ్ కలెక్టర్ కు, అధికారుల దృష్టికి ఖాళీ స్థలాన్ని మినీ స్టేడియం కోసం కానీ లేదంటే మంత్రి ప్రతిపాదించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఉపయోగించాలని కోరినట్లు తెలిపారు. వినతులు అందజేసిన కూడా ఇప్పటివరకు ఆ స్థలం భూమిని పరిశీలించి పరిరక్షించే విధంగా అధికారుల చర్యలు లేవనేది చాలా స్పష్టంగా కనబడుతోందని అన్నారు. కబ్జాకు గురవుతుంటే కూడా కండ్ల ముందున్న అధికారులు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీన్ని అధికారుల కుమ్మక్కుతోనే జరుగుతుందా.. లేదంటే అధికారులకు తెలియకుండా జరుగుతుందా అన్న సందేహాలకు సమాధానాలు మాత్రం దొరకడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. అధికారులు కూడా ఆ స్థాయి విచారణ గాని రక్షణ చర్యలు గాని ఇప్పటివరకు చేపట్టలేదని తెలిపారు.

ఇప్పటివరకు ఆ భూమిని సందర్శించిన అధికారులే లేరని, అంటే కాటారంలో ప్రభుత్వ భూములు ఏమైపోయినా.. కనీసం పట్టించుకునే పరిస్థితిలో అధికార యంత్రాంగం లేదని అన్నారు. దీన్ని బట్టి కాటారం సబ్ డివిజన్ పరిధిలో అధికార యంత్రాంగం అంతా విఫలమైందనే భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ప్రభుత్వ ఆస్తులను కాపాడుకునే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సర్వేనెంబర్ 71 లో ఉన్న ఖాళీ స్థానాన్ని తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని, దాని చుట్టూ కంచవేసి యువకులకు గాని ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోకపోతే కనీసం పేద ప్రజలకు పంచే విధంగా అయినా ఆ భూమిని ఉపయోగించాలని విన్నవించారు. లేదంటే అధికారులు మేం పట్టించుకోమని ఒక ప్రకటన విడుదల చేయాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయటంలో భాగంగానే ఆ భూమిని మేమే రక్షించేందుకు కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -