నవతెలంగాణ – వనపర్తి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ఎన్సీడి (అసంక్రమిక వ్యాధులు) కార్యక్రమ అమలు పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని వైద్యాధికారులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వైద్యాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన డాక్టర్ సాయినాథ్ రెడ్డి గ్రామ స్థాయిలో ఎన్సీడి స్క్రీనింగ్‌ను మరింత బలోపేతం చేయాలి, హైపర్‌టెన్షన్, మధుమేహం రోగులను నెల నెలా ఫాలోఅప్ చేసి, అవసరమైన మందులను సకాలంలో అందించడమే కాకుండా, వారి వివరాలను ఎన్సీడి పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి వైద్యాధికారి రోజూ కనీసం 5 సంజీవిని స్పెషలిస్ట్ టెలికన్సల్టేషన్ కాల్స్ చేయాలని, ప్రతి సబ్‌సెంటర్ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 10 జనరల్ కాల్స్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఈ అంశాలను సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
జిల్లాలో జరుగుతున్న డయాబెటిస్ రెటినోపతి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో సమగ్ర ప్రణాళికతో నిర్వహించాలని, క్యాంపుల్లో గుర్తించిన అనుమానితులను తదుపరి రోజు జిల్లా ఆసుపత్రికి పంపి అవసరమైన వారికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించేలా చూడాలని సూచించారు. గ్రామాలలో అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించి లైన్ లిస్ట్ తయారు చేసి, ఫాలో-అప్ కోసం జిల్లా కీమోథెరపీ కేంద్రానికి పంపాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే ప్యాలియేటివ్ కేర్, ఫిజియోథెరపీ అవసరమున్నవారిని గుర్తించి వారి వివరాలను జిల్లా కార్యాలయానికి అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పొగాకు మరియు దాని ఉత్పత్తుల వినియోగం ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ భాస్కర్ నాయక్, డాక్టర్ పరిమళ, అలాగే జిల్లా ఎన్సీడి టీం సభ్యులు శ్రీనివాస్ కొండ, అశోక్ కుమార్ పాల్గొన్నారు.



