నవతెలంగాణ – భువనగిరి
జిల్లాలో నమోదైన రెండు మాతృ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. గురువారం వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం మనోహర్ అధ్యక్షతన జిల్లా మాతృ మరణాల ఉప కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో నమోదైన రెండు మాతృ మరణాలపై సమగ్రంగా చర్చించారు. ఈ ఏడాది రాజాపేట మండలం పాముకుంట గ్రామం, రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామాలలో ఒక్కొక్క మాతృ మరణం చోటు చేసుకుంది. ఈ ఘటనలకు సంబంధించిన వైద్య సమాచారం, హెల్త్ వర్కర్ల నివేదికలు, ఆసుపత్రుల్లో అందించిన సేవల వివరాల పై సమీక్షించారు.
మాతృ మరణాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎం.ఎల్.హెచ్.పి మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. యం. మనోహర్ మాట్లాడుతూ, “ప్రతి గర్భిణికి ప్రాధమిక స్థాయిలో నుంచే సమగ్ర సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య మరియు ఆరోగ్య శాఖ పై ఉందని తెలిపారు. హై రిస్క్ గర్భిణి స్త్రీలలో సంబవించే రక్తహీనత, హై బీ.పి. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నచో, ఆరోగ్య సిబ్బంది సమన్వయం పాటించి సమయానికి రిఫెరల్ చేయడం మరియు ఎమర్జెన్సీ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఒక్క మాతృ మరణం వెనుక ఒక కుటుంబ బాధ, సమాజానికి నష్టం. వాటిని నివారించడానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం” అని తెలిపారు. అలాగే, భవిష్యత్తులో మాతృ మరణాలు జరగకుండా ఉండేందుకు జిల్లాలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అన్ని స్థాయిల వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలనే సూచనను ఆయన ఇచ్చారు.
గ్రామ స్థాయిలో గర్భిణుల గుర్తించడం నుంచి, హై రిస్క్ కేసుల ట్రాకింగ్ వరకు ప్రతి దశలో సమగ్రంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించారు. అలాగే, ప్రభుత్వాసుపత్రుల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, ఆరోగ్య సిబ్బందికి నిరంతర శిక్షణ ఇవ్వడం, ప్రతి గర్భిణి యొక్క ఈఈడి క్యాలెండర్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఈఈడి కేసులను ప్రసవం జరిగే వరకు ప్రతి రోజు ఫాల్లోప్ చేయడం ద్వారా మాతృ మరణాలను అరికట్టవచ్చి అన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, డా. యల్. యశోద, ప్రోగ్రాం అధికారిని, ఎంహెచ్ఎన్ డా. శిల్పిని, డిప్యూటీ డీ.ఎం. అండ్ హెచ్.ఓ, డా. ఇందిరామణి, ప్రొఫెసర్, హెచ్‌ఓడి , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, యాదాద్రి భువనగిరి, ఫైజాల్ రహమాన్ అసోసిఎట్ ప్రొఫసర్, అనస్థీషియా, డా. సాయి రమణి, అసోసిఎట్ ప్రొఫసర్ జనరల్ ఫిజిషియన్, సంబంధిత ప్రాథమిక వైద్యాధికారులు, సూపర్వైజర్ స్టాఫ్, మహిళ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.