నవతెలంగాణ – హైదరాబాద్: అత్యంత అధునాతన గాడ్జెట్‌లకు ఇంధనంగా పని చేసే చిన్న బ్యాటరీలను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మానవ గుండె స్థిరంగా కొట్టుకునేలా చేసే ఇంకా చిన్న పరికరాన్ని ఊహించుకోండి. ఈ ఊహ ఎంత గొప్పగా ఉందో కదా! అదే ఇది. ఈ తదుపరి తరం కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లీడ్లెస్ పేస్‌మేకర్ క్రమరహిత గుండె స్పందన నిర్వహించడానికి రూపొందించబడింది. గుండె చాలా వేగంగా, చాలా నెమ్మదిగా, అసమానంగా కొట్టుకున్నప్పుడు ఇది సంభవిస్తుంది. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అందులో ఒక సాధారణ రకం బ్రాడీకార్డియా.. అంటే గుండె చాలా నెమ్మదిగా కొట్టుకోవడం వల్ల శరీరానికి అవసరమైన రక్త ప్రసరణ జరగదు. ఈ పేస్‌మేకర్లు బ్రాడీకార్డియా వంటి సమస్యలను సమర్థవంతంగా, వేగవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి అత్యంత చిన్న పరిమాణంలో ఉంటాయి. తక్కువ శస్త్రచికిత్సతో అమర్చవచ్చు. అవసరమైతే తిరిగి తీసేయవచ్చు. ‘పేస్‌మేకర్’ అనేది హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడే ఒక వైద్య పరికరం. సంప్రదాయ పేస్‌మేకర్‌లను కాలర్‌బోన్ దగ్గర చర్మం కింద అమరుస్తారు. వైర్లతో గుండెకు అనుసంధానం చేస్తారు. ఈ వైర్లు గుండె సాధారణ రేటుతో కొట్టుకోవడానికి సహాయపడటానికి విద్యుత్ సంకేతాలను అందిస్తాయి. ఛాతీ నొప్పి, అలసట, దడ, అసౌకర్యం వంటి లక్షణాలు తగ్గుతాయి.
ఈ సందర్భంగా ఇండియా, దక్షిణాసియా, హాంకాంగ్, తైవాన్, కొరియా ప్రాంతాల అబాట్ కార్డియాక్ రిథమ్ మేనేజ్‌మెంట్ జనరల్ మేనేజర్ అజయ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఈ లీడ్లెస్ పేస్‌మేకర్లు వైద్యులు అమర్చడానికి, అవసరమైతే తీసేయడానికీ సులభంగా ఉండేలా అభివృద్ధి చేయబడ్డాయన్నారు. ఇవి ఇప్పటికే ఉన్న సాంకేతికతలపై గణనీయమైన మెరుగుదలలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది నిజంగా రోగుల జీవితాలను మార్చే ఆవిష్కరణ అన్నారు. హృదయ స్పందన సమస్యలను నియంత్రించడంలో కొత్త అవకాశాలను తెరుస్తుందన్నారు. ఈ సాంకేతికత వల్ల పేస్‌మేకర్లు మరింత చిన్నవిగా, ఆకర్షణీయమైన రూపంలోకి వచ్చాయన్నారు. సంప్రదాయ పద్ధతులలో ఉన్న ముఖ్యమైన సమస్యలను కూడా పరిష్కరించాయన్నారు. ఉదాహరణకు.. ఛాతీ భాగంలో పెట్టే పాకెట్లు, గుండెకు కలిపే వైర్లు (లీడ్స్) వల్ల ఇన్ఫెక్షన్లు, వైర్లు కదిలిపోవడం, తెగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. ఇవి తీవ్రమైన హృదయ సమస్యలకు దారి తీసే అవకాశం ఉందన్నారు. కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం అయ్యే పరిస్థితి కలుగుతుందన్నారు. ఇవి ఆ లోపాలను అధిగమించాయన్నారు. హృదయ సంబంధిత ఆవిష్కరణల వల్ల అత్యాధునిక లీడ్లెస్ పేస్‌మేకర్లు సాధ్యమయ్యాయని తెలిపారు.
ఈ సందర్భంగా యశోదా హాస్పిటల్స్ (సికింద్రాబాద్) ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, డివైస్ నిపుణులు డాక్టర్ చంద్రమౌళి ఎస్ మంత్రవాడి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేలాది మంది రోగులకు పేస్‌మేకర్ శస్త్రచికిత్స అవసరం అవుతుందన్నారు. అయితే, ఈ శస్త్రచికిత్సలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. కనిపించే మచ్చలు కూడా ఉంటాయన్నారు. లీడ్లెస్ పేస్‌మేకర్లు గుండె వైద్యంలో ఒక గొప్ప పురోగతి అన్నారు. ఇవి తక్కువ శస్త్రచికిత్సతో అమర్చవచ్చన్నారు. బయటికి కనిపించవన్నారు. శస్త్రచికిత్స అనంతరం వచ్చే సమస్యలను గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు. ఈ సాంకేతికత సహజమైన గుండె స్పందన కొనసాగించేందుకు తోడ్పడుతుందని తెలిపారు. దీని వల్ల ఫలితాలు మెరుగవుతాయన్నారు. ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం, లీడ్స్ సంబంధిత సమస్యలు తగ్గుతాయన్నారు. మళ్లీ శస్త్రచికిత్స అవసరం పడే పరిస్థితి కూడా తగ్గుతుందన్నారు. కచ్చితమైన అమరిక కోసం, చికిత్సలో సౌలభ్యం కోసం రూపొందించిన కొన్ని లీడ్లెస్ పేస్‌మేకర్లు రోగులకు అనుగుణంగా ప్రత్యేక పరిష్కారాలు అందిస్తాయని తెలిపారు.
సంప్రదాయ పేస్‌మేకర్లకు ఛాతీలో కోత అవసరం అవుతుందన్నారు. లీడ్లెస్ పేస్‌మేకర్లు హృదయంలోకి క్యాథెటర్ (సన్నని గొట్టం) సహాయంతో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కొత్త తరం పేస్‌మేకర్లు అమరికకు ముందు గుండె ఎలక్ట్రికల్ మ్యాప్ చూపే విధంగా రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల శస్త్రచికిత్స నిపుణులు రోగి గుండె నిర్మాణాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని పరికరాన్ని అత్యంత కచ్చితంగా అమర్చగలుగుతారన్నారు. క్యాథెటర్ ద్వారా పేస్‌మేకర్‌ను ప్రవేశపెట్టేటప్పుడు అది ఒక రక్షణ కవచంతో కప్పబడి ఉంటుందన్నారు. దీని వల్ల రక్త నాళాల ద్వారా సులభంగా కదిలించుకోవచ్చన్నారు. గాయపడే ప్రమాదం తగ్గుతుందన్నారు.
రోగులు కోలుకునే సమయం గణనీయంగా తగ్గడం లీడ్లెస్ పేస్‌మేకర్ తో అతిపెద్ద ప్రయోజనం అన్నారు. రోగులు తక్కువ సమయంలోనే ఇంటికి వెళ్లవచ్చన్నారు. పెద్దగా ఆంక్షలు లేకుండా తమ దైనందిన జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చన్నారు. పేస్‌మేకర్ హృదయంతో సహజంగా కలిసిపోతుందని తెలిపారు. దాని వల్ల మచ్చలు, బయటికి కనిపించే ఉబ్బు వంటి లక్షణాలు ఉండవన్నారు. తక్కువ శస్త్రచికిత్స ద్వారా పేస్‌మేకర్ అమర్చడం వల్ల రోగులు హాస్పిటల్‌లో ఉండే రోజులు తగ్గుతాయన్నారు. వేగంగా కోలుకుంటారన్నారు. భారతదేశంలో టైర్ 2, టైర్ 3 నగరాలలో ఫాలో-అప్ చికిత్స అందుబాటులో తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సాంకేతికత ఒక గొప్ప ముందడుగు అన్నారు. సంప్రదాయ వ్యవస్థల్లో ఉన్న క్లిష్టతలను తొలగించడం ద్వారా లీడ్లెస్ పేస్‌మేకర్లు రోగులకు భద్రత, సౌలభ్యం రెండింటినీ అందిస్తాయన్నారు. ఇవి మన ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలకు అద్భుతంగా సరిపోతాయని తెలిపారు. లీడ్లెస్ పేస్‌మేకర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేది దాని భద్రతతో కూడిన చికిత్సను అందించగల శక్తి, రోగుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండే సామర్థ్యం అన్నారు. గుండె సంరక్షణలో ఈ సాంకేతికత సరి కొత్త ప్రమాణాన్ని సృష్టిస్తోందన్నారు.