చరిత్రను వక్రీకరించే కాషాయులను కడిగేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ – ముషీరాబాద్
దొడ్డి కొమురయ్య రగిల్చిన విప్లవాగ్నితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అంకురార్పణ జరిగిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ వేగుచుక్క, రేపటి వెలుగుల దివిటీ అని కొనియాడారు. దొడ్డి కొమురయ్య 79వ వర్థంతి సందర్భంగా శుక్రవారం తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కొమురయ్య వీరోచితంగా పోరాడా రని గుర్తు చేశారు. 60 గ్రామాల భూస్వామిని ఊరు నుంచి, గడీ నుంచి తరిమి కొట్టిన చరిత్ర దొడ్డి కొమరయ్యకుందన్నారు. ప్రపంచ చరిత్రలో పోరాట స్ఫూర్తిని చాటిన నిప్పుకణిక అన్నారు. వారి నిజ చరిత్ర వారసులుగా ఆయన గురించి భావి తరాలకు అందించ డానికి ”పల్లెలకు పోదాం -ప్రజలకు చెప్పుదాం.. చరిత్రను వక్రీకరించే కాషాయులను కడిగేద్దాం” అని పిలుపునిచ్చారు.
చెరిపేస్తే చెరిగే చరిత్ర కాదు
ఎస్వీకే కార్యదర్శి ఎస్.వినయకుమార్ మాట్లాడుతూ .. కమ్యూనిస్టులపై కక్షతో ఆనాటి కాంగ్రెస్ రజాకార్లను, భూస్వాములను చేరదీసి రైతాంగ సాయుధ పోరాటానికి ద్రోహం చేసిందన్నారు. కానీ ఆ పోరాటం చెరిపేస్తే చెరిగే చరిత్ర కాదనీ, ఎవరు వక్రీకరించినా తెలంగాణ ప్రజా కోర్టులో ద్రోహులుగా నిలబడతారని, చరిత్రను చరిత్ర గానే చూడాలని వివరించారు. టీపీఎస్‌కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రజాకార్ సినిమాకు గద్దర్ అవార్డ్ ఇవ్వడంలోనే కాంగ్రెస్ కపటత్వం కనిపిస్తున్నదన్నారు.
సాయుధ పోరాట నిజచరిత్రను సాంస్కృతిక యాత్రల ద్వారా.. ఆట పాటలతో ప్రచారం చేస్తామ న్నారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య అమరత్వ స్ఫూర్తితో భూ విముక్తి పోరాటం చెస్తామని అంతా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జానపద జేఏసీ చైర్మెన్ మురళీధర్ దేశ్‌పాండే, ఎస్‌వీకే నాయకులు బుచ్చిరెడ్డి, ఎన్.సోమయ్య, టీపీడీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐతగోని విజరు, టీపీటీఎల్‌ఎఫ్ నాయకులు మహేష్ దుర్గే, యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్ విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవాగ్ని దొడ్డి కొమురయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES