కానిస్టేబుల్‌ను హత్య చేసిన దుండగుడి అరెస్టు
ఎన్‌కౌంటర్ అంటూ పుకార్లు.. : కొట్టిపారేసిన సీపీ
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 17న(శుక్రవారం) సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన నిందితుడు రియాజ్‌ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని 6వ టౌన్ పరిధిలో ఆసీఫ్ అనే వ్యక్తిపై సైతం రియాజ్ దాడి చేయగా.. అక్కడ పెనుగులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్పందించిన పోలీసులు రియాజ్‌ను అదుపులోకి తీసుకొని ఆస్పత్రికి తరలించారు. కాగా రియాజ్ ఎన్‌కౌంటర్ అయినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. సీపీ సాయిచైతన్య స్పందించి వాటిని కొట్టిపారేస్తూ ప్రకటన విడుదల చేశారు.
వివిధ కేసుల్లో నిందుతుడిగా ఉన్న రియాజ్‌ను సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్, ఏఎస్‌ఐ విఠల్ కలిసి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. బైక్‌పై స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో డ్రైవింగ్ చేస్తున్న ప్రమోద్‌పై.. నిందితుడు రియాజ్ కత్తితో దాడి చేశాడు. వెనుకాల మరో బైక్‌పై వస్తున్న ఏఎస్‌ఐ విఠల్.. అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా.. ఆయనపై సైతం దాడి చేసి నిందితుడు పరార్ అయ్యాడు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డు సైతం ప్రకటించారు. 6వ టౌన్ పరిధిలో నిందితుడున్నట్టు ప్రాథమిక సమాచారం అందడంతో శనివారం రాత్రి నుంచి పోలీసులు తనిఖీలు చేపట్టారు.
నిందితుడి బైక్ కెనాల్ సమీపంలో లభించడంతో.. డ్రోన్‌ల సాయంతో సైతం గాలింపుచర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం సారంగాపూర్ శివారులోనే ఓ లారీ క్యాబిన్‌లో దాక్కున్నట్టు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లగా.. పోలీసులను చూసి నిందితుడు పారిపోయాడు. నెహ్రు నగర్‌కు చెందిన అసిఫ్ రియాజ్‌ను పట్టుకోవడానికి వెళ్లగా సదరు నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటుచేసుకోవడంతో ఇద్దరికి గాయాలు అయ్యాయి. హుటాహుటిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
ఎన్‌కౌంటర్ అంటూ పుకార్లు
కాగా నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్ అయినట్టు సోషల్ మీడియాలో పుకార్లు వెల్లువెత్తాయి. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కాల్పులు చేయడంతో మృతిచెందినట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలను సీపీ సాయిచైతన్య ఖండించారు.