రోహిత్ సెంచరీ, కోహ్లి అర్ధసెంచరీ
సిరీస్ 2-1తో ఆస్ట్రేలియా కైవసం
మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం
సిడ్నీ: వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. చివరి వన్డేలో దుమ్ము రేపింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారతజట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి 2వ వికెట్‌కు అజేయంగా 168 పరుగులు జతచేసి మ్యాచ్‌ను ముగించారు. దీంతో భారతజట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు కట్టడి చేశారు. హర్షిత్ రాణా(4/39), సుందర్(2/44)కి తోడు సిరాజ్, ప్రసిధ్, కుల్దీప్, అక్షర్ ఒక్కో వికెట్‌తో రాణించారు. దీంతో ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో టీమిండియాకు శుభారంభం లభించింది. శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 69 పరుగులు జత చేశారు. 24 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి కెప్టెన్ శుభ్‌మన్ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి బంతికే తన పరుగుల ఖాతా తెరిచాడు. తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లీ ఈ మ్యాచ్‌లో చెలరేగాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్వేచ్ఛగా పరుగులు రాబట్టారు.
రో-కో ధాటికి ఆసీస్ బౌలర్లు తేలిపోయారు. వీరు రెండో వికెట్‌కు 169 బంతుల్లో 168 పరుగులు జత చేసి మ్యాచ్‌ను ముగించారు. రెండో మ్యాచ్‌లో అర్ధ శతకం చేసిన రోహిత్ ఈ వన్డేలో 105 బంతుల్లో సెంచరీ కొట్టాడు. 125 బంతుల్లో 121 పరుగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ కెరీర్‌లో ఇది 50వ సెంచరీ. వన్డేల్లో అతడికిది 33వ శతకం. ఇక విరాట్ కోహ్లీ 56 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 81 బంతుల్లో 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రో-కో ద్వయం రాణించడంతో టీమిండియా 38.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా అందుకుంది. ఆసీస్ బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ మాత్రమే ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు ఆసీస్ బ్యాటర్లలో మ్యాట్ రెన్‌షా(56), మిచెల్ మార్ష్(41) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. 1986 తర్వాత ఇలా ఆసీస్‌పై ప్రతి బౌలరూ వికెట్ తీయడం ఇదే తొలిసారి. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో కైవసం చేసుకోగా.. 29(బుధవారం) నుంచి ఐదు టి20 సిరీస్ ప్రారంభం కానుంది.
రోహిత్ 50వ సెంచరీ
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీని కొట్టాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 50 సెంచరీలు కొట్టిన రోహిత్… ఒక్కో ఫార్మాట్‌లో ఐదు అంతకుమించి సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ రోహిత్ శర్మకు దక్కాయి.
స్కోర్‌బోర్డు :
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మిఛెల్ మార్ష్ (బి)అక్షర్ 41, హెడ్ (సి)ప్రసిధ్ (బి)సిరాజ్ 29, షార్ట్ (సి)కోహ్లి (బి)సుందర్ 30, రెన్‌షా (ఎల్‌బి)సుందర్ 56, క్యారీ (సి)శ్రేయస్ (బి)హర్షిత్ రాణా 24, కూపర్ (సి)కోహ్లి (బి)హర్షిత్ రాణా 23, ఓవెన్ (సి)రోహిత్ (బి)హర్షిత్ రాణా 1, స్టార్క్ (బి)కుల్దీప్ 2, ఎల్లిస్ (సి)రోహిల్ (బి)ప్రసిధ్ 16, జంపా (నాటౌట్) 2, హేజిల్‌వుడ్ (బి)హర్షిత్ రాణా 0, అదనం 12. (46.4ఓవర్లలో ఆలౌట్) 236పరుగులు.
వికెట్ల పతనం: 1/61, 2/88, 3/124, 4/183, 5/195, 6/198, 7/201, 8/223, 9/236, 10/236
బౌలింగ్: సిరాజ్ 5-1-24-1, హర్షిత్ రాణా 8.4-0-39-4, ప్రసిధ్ 7-0-52-1, కుల్దీప్ 10-0-50-1, అక్షర్ 6-0-18-1, సుందర్ 10-0-44-2.
ఇండియా ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (నాటౌట్) 121, శుభ్‌మన్ గిల్ (సి)క్యారీ (బి)హేజిల్‌వుడ్ 24, కోహ్లి (నాటౌట్) 74, అదనం 18. (38.3ఓవర్లలో వికెట్ నష్టానికి) 237పరుగులు.
వికెట్ల పతనం: 1/
బౌలింగ్: స్టార్క్ 5-0-31-0, హేజిల్‌వుడ్ 6-1-23-1, ఎల్లిస్ 7.3-0-60-0, కూపర్ 5-0-36-0, జంపా 10-0-50-0, ఓవెన్ 1-0-2-0, షార్ట్ 4-0-29-0.
రో-కో రీలోడెడ్
రోహిత్, కోహ్లి (రో-కో) కలిసి నిలబడితే భారత్‌కు ఎదురే లేదని మరోసారి రుజువైంది. సగటు భారత అభిమాని కోరుకునేది ఇదే కదా..! చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలివిడిగా ఆడి.. విడివిడిగా గెలిచారు.. భారత్‌ను గెలిపించారు. రిటైర్మెంట్ వార్తల వేళ ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సెంచరీ, విరాట్ అర్ధ సెంచరీ చేసి అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు.




