నవతెలంగాణ – బేగంపేట్
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం గం6.00 నిమిషాలకు ప్రమాదం జరిగింది. పంజా గుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళుతున్న కంటైనర్ వేగంగా ప్రయాణిస్తూ బేగంపేట ఫ్లై ఓవర్ దిగుతుంది. ఇదే సమయంలో బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ నుంచి సికింద్రాబాద్ వైపు ప్రయాణిస్తున్న థార్ కారు కట్ట మైసమ్మ మహాలక్ష్మి ఆలయం వద్ద రోడ్డు ఎక్కుతుంది. పై నుంచి వేగంగా వస్తున్న కంటైనర్ ను గమనించిన థార్ కారు యజమాని తన వాహనాన్ని ఎడమ వైపుకు తప్పించాడు. అయితే వేగంగా వస్తున్న కంటైనర్ అదుపు తప్పి థార్ కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టి ముందుకు వెళ్ళి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు బోల్తా కొట్టింది. అప్రమత్తమైన స్థానికులు థార్ యజమాని సమాచారాన్ని 108కి అందించారు. వెంటనే స్వల్ప గాయాల పాలైన కంటైనర్ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ లు రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించారు.




