నవతెలంగాణ – హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు ఎంపికపై మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తీవ్ర విమర్శలు చేశారు. జట్టులో చోటు దక్కాలన్నా, జట్టులో సుస్థిర స్థానం పొందాలన్నా ముంబయి, ఢిల్లీ, పంజాబ్ నేపథ్యం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. న్యూజిలాండ్ జట్టు భారత పర్యటన ఖరారైన నేపథ్యంలో బీసీసీఐ టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది.
ఇందులో రుతురాజ్ గైక్వాడ్ కు చోటు దక్కకపోవడంపై రాబిన్ ఊతప్ప తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ లో రుతురాజ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘న్యూజిలాండ్ తో తలపడే భారత జట్టులో స్థానం దక్కకపోవడం నీకు జీర్ణించుకోలేని విషయమే. భారత క్రికెట్ లో ఉన్న సవాళ్లలో ఇదొకటి. ముంబయి, ఢిల్లీ, పంజాబ్ నేపథ్యంలేని ఆటగాళ్లు భారత జట్టులో సుస్థిర స్థానం పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది’ అని రాబిన్ ఊతప్ప అన్నారు.



