పరీక్షల్లో మంచి ఫలితాలు రాలేదనీ, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడనీ, భర్త వేధిస్తున్నాడనీ… ఇలా బాధలోనో, కోపంలోనే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. ఆ ఒక్క క్షణం వారి మనసులోని బాధను పంచుకునేవారుంటే ఒక నిండు జీవితం కాపాడబడుతుంది. అలా నిరాశ నిండిన మనసుకు ఊరట కల్పించేదే రోషిణి హెల్ప్‌లైన్. గత 28 ఏండ్ల నుండి హైదరాబాద్ నగరంలో తన సేవలు అందిస్తుంది ఈ అంతర్జాతీయ సంస్థ. ఈ రోజు ‘ఆత్మహత్యల నివారణ దినం’. ఈ సందర్భంగా ఆ సంస్థలో స్వచ్ఛంధంగా పని చేస్తూ ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇస్తున్న మహిళా వాలంటీర్ల అనుభవాలను పంచుకుందాం…
రోషిణి హెల్ప్‌లైన్: 040 66 20 2000, 81420 20033, 040 66 20 2001, 81420 20044
Website : www.roshiningo.net
సలీమ
‘రోషిణి’ మానసిక ధైర్యాన్ని ఇస్తుంది
రోషిణి స్వచ్ఛంద సంస్థలో చేరి 20 ఏండ్లు అవుతుంది. అప్పటి నుండి ఇందులో వివిధ బాధ్యతలను నిర్వహిస్తున్నాను. మానసిక ఒత్తిడితో సతమతమయ్యే వారికి, ఆత్మహత్యా ఆలోచనలున్న వారికి స్వాంతన కలిగిస్తూ వారికి మనోధైర్యాన్ని అందించే సామాజిక సేవలో భాగం పంచుకోవటం చాలా సంతోషాన్ని ఇస్తుంది. మానసిక ఒత్తిడితో సతమతమవుతూ, నిరాశలో బతుకు చాలించుకోవాలనుకునే వారికి ముందుగా వారి సమస్యలను శ్రద్ధగా ఆలకించి మేమున్నామనే భరోసా కలిగిస్తుంది రోషిణి సంస్థ. వారికి మనో నిబ్బరాన్ని అందిస్తూ ఆత్మహత్య ఆలోచన నుండి తప్పించి మానసిక ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇవ్వాళ ప్రపంచంలో జరిగే అనేక మరణాలలో ఆత్మహత్యల కారణంగా జరిగేవే అధికం. సమస్యలతో సతమతమయ్యే వారికి మానసిక ఆసరా అవసరం. అలాంటి వారికి ఊరట అందించే మంచి సేవా కార్యక్రమం చేస్తూ ఎంతో ఆత్మ తృప్తిని పొందుతున్నాను. ఫోన్ ద్వారా మాట్లాడినా, వ్యక్తిగతంగా వచ్చి తమ సమస్యల్ని పంచుకున్నా ఊరటనిచ్చే మా మాటలతో వారి మనసును తేలికపరుస్తాం. అంతే కాకుండా వివిధ విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులకు అవగాహన కలిగించే ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మనకోసం బతికిన రోజుల కన్నా ఇలా ఈ వయసులో నలుగురి కోసం బతకడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అవసరమున్న బాధితులకు ఉపయోగపడే మంచి వేదికగా ఉన్న రోషిణి ఆధ్వర్యంలో సేవలు అందించడం నాకు దక్కిన మంచి అవకాశంగా భావిస్తున్నాను. సెప్టెంబర్ 10 ప్రపంచ ఆత్మహత్యల నివారణ రోజున మేము చేసే వివిధ అవగాహన కార్యక్రమాలతో కొంతవరకైనా ఆత్మహత్యల రేటు తగ్గుతుందని మా ఆకాంక్ష. రోషిణి వాలింటీర్‌ని నేను అనుకుంటేనే గర్వంగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఎంతో వుంది. జీవితం వద్దు.. అని చనిపోతున్న వారిని.. తిరిగి కొత్త జీవితంలోకి తీసుకురావటం కంటే ఇంక ఏం కావాలి…
ఆనంద దివాకర్, ప్రిన్సిపాల్ (రిటైర్డ్)
బాధను పంచుకునేవాళ్లు కావాలి
‘ఎందుకమ్మా అన్నిసార్లు తలుపు దగ్గరికి వెళ్లి నిల్చుంటున్నావు. మళ్లీ మళ్లీ లోపలికి, అక్కడికి తిరుగుతున్నావు. పెద్ద గాలి వస్తే లేదా రైలు కుదుపుతో తలుపు పడిపోయి కిందపడిపోతావు. పైగా మనం కృష్ణా నది మీద వెళుతున్నాం. కాలు జారిగే నదిలో పడిపోతావు’ అన్నాను. ‘అందుకేగా అన్నిసార్లు వెళుతుంది’ అన్నదామె నా వైపు నిర్లక్ష్యంగా చూస్తూ. పరిస్థితి అర్థమయింది. ‘ఏమ్మా !ఏం జరిగింది?’ అడిగాను. కానీ అదే నిర్లక్ష్యం. కాసేపటి తర్వాత తన కథ చెప్పింది. ఓపిగ్గా విని చాలా సేపు మాట్లాడాను. తన మనసు మార్చుకుంది. ‘ఆ క్షణంలో ఎవరైనా వాళ్ళు చెప్పేది వింటే ఆ జీవితాలు నిలుస్తాయి కదా’ అనిపించింది. టీచర్‌గా పని చేస్తున్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇంట్లో సమస్యల గురించి నాతో చెప్పుకునేవారు. అంటే ప్రతి ఒక్కరికీ తమ మనసులోని బాధ ఇంకొకరికి చెప్పుకోవాలనిస్తుంది. వాళ్లను తప్పు పట్టకుండా ఒకవేళ తప్పులు ఉన్నా నిష్పక్షపాతంగా వినేవాళ్ళు కావాలి. 2012లో అనుకోకుండా ఒకరోజు ఓ తెలుగు దినపత్రికలో చిన్న ప్రకటన చూశాను. అది రోషిణి హెల్ప్ లైన్. ఎవరో ఒక వాలంటీర్ ఫోన్ తీసి నా వివరాలు తీసుకున్నారు. నేనింతకు ముందు డీఆర్‌డీఎల్‌లో జూనియర్ సైంటిస్ట్‌గా చేశాను. నా భర్త ఉద్యోగరీత్యా రిజైన్ చేశాను. చాలా ఏండ్ల తర్వాత తిరిగి హైదరాబాదు వచ్చాను. సికింద్రాబాద్లో ఉన్న రోషిణి హెల్ప్ లైన్‌కి రావడానికి మా అబ్బాయి సహాయం తీసుకున్నాను. గ్రూప్ డిస్కషన్‌లో సీనియర్ వాలంటీర్స్ మనలను, మనం వినే విధానం, అర్థం చేసుకునే పద్ధతిని గమనిస్తారు. అక్కడ సెలెక్ట్ చేసిన వారిని తిరిగి మూడు అంచెలుగా ఇంటర్వ్యూ చేసి, వడపోసి ట్రైనింగ్‌కి పిలుస్తారు. ట్రైనింగ్ తర్వాత కొంత కాన్ఫిడెన్స్‌తో ఫోన్ కాల్స్ తీసుకోవడం మొదలుపెట్టా. ప్రస్తుతం నేను దేశ విదేశాలలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తున్నాను. బీఈడీలో చైల్డ్ సైకాలజీ, అడల్ట్ సైకాలజీ, సిలబస్‌లో భాగంగా చదవడం వల్ల అది ఆన్లైన్ ట్యూటర్‌గా, రోషిణి హెల్ప్ లైన్ వాలంటీర్‌గా నాకు ఉపయోగపడుతున్నది. నిరాశలో ‘ఏం చేయాలో తెలియట్లేదు’ అన్న దిగులుతో ఫోన్ చేసినవాళ్లు ఫోన్ పెట్టేసే ముందు ‘చాలా రిలీఫ్‌గా రిలాక్స్డ్‌గా ఉందండి మీతో మాట్లాడిన తర్వాత’ అంటుంటే పొందే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ‘ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదు. నేనెందుకు బతకాలి’ అని ఫోన్ చేసే వాళ్లు, నాతో మాట్లాడిన తర్వాత ‘నేనెందుకు చనిపోవాలి? నా శక్తిని నేను నమ్ముకుంటా. నా విలువను ప్రపంచానికి తెలియజేస్తాను’ అంటే అవధులు లేని ఆనందం కలుగుతుంది.
నిర్మల
ప్రాణం చాలా విలువైనది
నాకు ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్‌లో బ్యాక్ గ్రౌండ్ ఉంది. కొన్నాళ్లు ఆర్కిటెక్స్ స్టూడియోలో ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో టీచింగ్ అసిస్టెంట్‌గా చేశాను. మావారి ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రాలు వెళ్లడం వల్ల నా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చాక ఒక రోజు పేపర్లో రోషిణి గురించిన ప్రకటన చూశాను. ఇక్కడైతే ఎక్కువ మందికి సహాయం చేయవచ్చనే ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్లకి ఫోన్ చేసి, సెలెక్ట్ అయి ట్రైనింగ్ తీసుకుని వాలంటీర్‌గా చేరాను. ఇప్పటికి పదేండ్లు కావస్తోంది. మా వారు, మా ఇద్దరమ్మాయిలు చాలా ప్రోత్సాహించారు. ఇక్కడకు వచ్చినవారంతా వాళ్ళ బాధలు, కష్టాల గురించి చెప్పుకునేవారు. వాళ్ళ బాధలు తగ్గించడానికి ముందు వాళ్ల గురించి అర్థం చేసుకోవాలి. ఇలా బాధలో ఉన్న వారితో మాట్లాడుతూ ధైర్యం ఇవ్వడం చాలా తృప్తిగా అనిపిస్తుంది. జీవితంపై విరక్తి పుట్టిన వారు, ఇక బతకడం వృధా అనుకునే వారు మాకు కాల్ చేస్తుంటారు. వాళ్లతో మాట్లాడి వాళ్లకు జీవితంపై కొత్త ఆశలు కల్పించడంలో మా వాలింటీర్స్ బాగా పని చేస్తారు. వాళ్ళని ఆ ఆలోచన నుంచి విరమింప చేసినప్పుడు కలిగే తృప్తి వేరుగా ఉంటుంది. ఆ ఒక్క మనిషికే కాకుండా వాళ్ళ కుటుంబానికి సైతం సాయం చేశామనే భావన కలుగుతుంది. ప్రేమ పేరుతో మోసపోయిన అమ్మాయిలు కూడా ఫోన్ చేస్తుంటారు. ఇంకా చదువుకోడానికి ఆటంకాలు, ఉద్యోగాలు దొరక్కపోవడం, ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, గృహహింస ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతూ మా దగ్గరకు వస్తారు. ప్రాణం చాలా విలువైనది. సమస్యలు తాత్కాలికమైనవి. వాటి కొరకు ఆత్మహత్య చేసుకోవడం ఎంత వరకు సమంజసమో వారికి అర్థమయ్యేలా చెబుతాం. ఈ ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యే ఉండదని నా నమ్మకం.
విద్యా రెడ్డి