సరుకులు రవాణా చేయకుండానే బిల్లులు జారీ
రూ.33.20 కోట్లు ట్యాక్స్ క్రెడిట్ పొందిన కీషాన్ ఇండిస్టీస్
వాణిజ్య పన్నుల శాఖ తనిఖీల్లో వెల్లడి
పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వాణిజ్య పన్నుల శాఖల తనిఖీల్లో భారీ మోసం బయటపడింది. సరుకులు రవాణా చేయకుండానే అందుకు సంబంధించి బిల్లులు జారీ చేస్తూ పెద్ద ఎత్తున మోసానికి పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని కీషాన్ ఇండిస్టీస్ ఎల్‌ఎల్‌పీ కంపెనీ పన్నులు చెల్లించకుండానే అక్రమాలకు తెరలేపింది. సంస్థ చేస్తున్న మోసాలను పసిగట్టిన అధికారులు హైదరాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయం, సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమోటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని తయారీ యూనిట్లపై ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సంస్థ సరుకులు తరలించకుండా భారీ విలువ కలిగిన కాపర్‌కు సంబంధించి ట్యాక్స్‌్ బిల్లులు జారీ చేసినట్లు గుర్తించారు. ఖాళీ వాహనాలను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పంపించగా, డాక్యుమెంట్లలో మాత్రం భారీ సరుకుల రవాణా జరిగినట్టు చూపించారు. మోసపూరిత బిల్లుల మొత్తం విలువ రూ.100 కోట్లకుపైగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ మోసం జాతీయ రహదారి టోల్‌గేట్ డేటా విశ్లేషణ ద్వారా వెలుగులోకి వచ్చింది. వాహనాలు తిరగని పరిస్థితిలోనూ, ఈ-వే బిల్లులపై వాటిని సరుకులతో వెళ్ళినట్టు చూపారు. సంస్థ సుమారు రూ.33.20 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)ను నకిలీ లావాదేవీల ద్వారా పొందినట్టు కనుగొన్నారు. ఇది తెలంగాణలో కనుగొన్న కొత్త రకం జీఎస్టీ మోసంగా భావిస్తున్నారు. పన్ను ఎగవేతలో ఓ కొత్త, ప్రమాదకర ధోరణిని సూచిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల సందర్భంగా అధికారులు ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్క్‌లు, సీసీటీవీ ఫుటేజ్ తదితర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ డైరెక్టర్లు వికాస్ కుమార్ కీషాన్, రజనీష్ కీషాన్‌పై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీకి ఫిర్యాదు చేశారు.
రూ.100 కోట్లు మింగేశారు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES