Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం13 జిల్లా కోర్టులకు రూ.1053కోట్లు

13 జిల్లా కోర్టులకు రూ.1053కోట్లు

- Advertisement -

– రాష్ట్ర ప్రభుత్వం మంజూరు
– మిగిలిన జిల్లాలకు రూ.891 కోట్లకు ప్రతిపాదనలు: హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని 13 జిల్లా కోర్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,053 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిం దనీ, మిగిలిన జిల్లాలకు రూ.891 కోట్లకు హైకోర్టు చేసిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రకటించారు. జనగాం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్‌, కరీంనగర్‌, మహబూబ్‌ నగర్‌, మంచిర్యాల, ములుగు, నిర్మల్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కోర్టు సముదాయాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,053 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. మిగిలిన జిల్లాలకు రూ.891 కోట్లకు ప్రతిపాదనలకు ఆమోదం లభించాల్సి ఉందని తెలిపారు. హైకోర్టు, జిల్లా కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు ఆవరణలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో జస్టిస్‌ ఏకే సింగ్‌ ప్రసంగిస్తూ, ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని గుర్తు చేశారు. గత ఏడాదిలో 210 రోజులు కోర్టులు పని చేస్తే 74,768 కేసులు నమోదయ్యాయనీ, 72,414 కేసులు పరిష్కారం అయ్యాయని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు 3,500, హైకోర్టు తీర్పులు 2 వేలు తెలుగులోకి అనువాదం చేయించినట్టు తెలిపారు. జాతీయ లోక్‌ అదాలత్‌లో 55,20,379 కేసులు పరిష్కారంతో కక్షిదారులకు రూ.236 కోట్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రెగ్యులర్‌ అదాలత్‌లోనూ 59,310 కేసులు పరిష్కారం కావడంతో రూ.207.98 కోట్లు అందజేసినట్టు వివరించారు. అన్ని జిల్లాల్లో ఒకే రకంగా కోర్టు నిర్మాణం కోసం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ‘న్యాయ నిర్మాణ్‌’ను అనుసరిస్తున్నామని చెప్పారు ఫ్యామిలీ, పోక్సో కోర్టులతో పాటు వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీ ఏ.సుదర్శన ్‌రెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ ఏ.నరసింహారెడ్డి, హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏ.జగన్‌ మాట్లాడారు. హైకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ చల్లా కోదంరామ్‌, జస్టిస్‌ జి.రఘురామ్‌, జస్టిస్‌ సీవీ రాములు, జస్టిస్‌ భిక్షపతి, జస్టిస్‌ జి.యతిరాజు, జస్టిస్‌ రవికుమార్‌, జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, జస్టిస్‌ గోపాల్‌రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad