– ఇద్దరి నిందితుల అరెస్టు
– మరికొందరి కోసం గాలిస్తున్న సీఐడీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
అధిక మొత్తంలో వడ్డీలు చెల్లిస్తామనీ, తమ సంస్థలో పనిచేసేవారు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని ఆశచూపించి రూ.140 కోట్లు లూటీ చేసిన ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యూచువల్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మెన్ తిప్పవరపు రామదాసప్పనాయుడు, అతని కుమారుడు సాయికిరణ్‌ను చెన్నైలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో సీఐడీ డీజీ చారుసిన్హా కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఆమె వివరాల ప్రకారం… రామదాసప్ప నాయుడు ‘ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ’ పేరిట సంస్థను స్థాపించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 300వరకు బ్రాంచీలు తెరిచాడు. 1600 మంది మార్కెటింగ్ సిబ్బందిని నియమించు కున్నాడు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టే వారికి పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లిస్తామని పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. తమ సొసైటీలో చేరిన వారికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తామని నమ్మబలికాడు. రైతులు, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారిని ఆకర్షించి పెద్ద మొత్తంలో డిపాజిట్లను సేకరించాడు. అందులో డిపాజిట్ పెట్టిన వారి డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌తో పాటు వివిధ బడా పరిశ్రమల్లో పెట్టుబడులుగా పెట్టి వాటి ద్వారా వచ్చే లాభాలతో భారీగా వడ్డీలు కూడా చెల్లిస్తామని నమ్మించాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేలమందికిపైగా డిపాజిట్ దారుల నుంచి రూ.140 కోట్లను సేకరించాడు. తమ సంస్థ భవిష్యత్తులో ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రభుత్వ గుర్తింపు సంస్థగా మారబోతున్నదంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. అలా మరికొందరు డిపాజిటర్లను ఆకర్షించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే రామదాసప్ప నాయుడు బోర్డు తిప్పేశాడు. బాధితులు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్లకు పరుగులు తీశారు. హైదరాబాద్, అమరావతి, కడప, కర్నూల్, తదితర జిల్లాల్లో తాము మోసపోయా మంటూ కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసును సీఐడీకి అప్పగించారు. దర్యాప్తులోకి దిగిన సీఐడీ అధికారులు ఆ సంస్థపై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు రామదాసప్ప నాయుడుతో పాటు అతని కుమారుడు సాయికిరణ్‌ను మంగళ వారం అరెస్టు చేశారు. వారిద్దరినీ జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు చారుసిన్హా తెలిపారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
ముద్ర పేరుతో రూ.140 కోట్లు స్వాహా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES