న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2000 నోట్లను ఉపసంహరించుకుని రెండున్నరేండ్లు అవుతోన్నప్పటికీ.. ఇప్పటికీ దాదాపు రూ.5,743 కోట్ల విలువ చేసే నోట్లు కేంద్ర బ్యాంక్‌కు చేరలేదు. అక్టోబర్ 31 నాటికి రూ.5,817 కోట్ల విలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉండగా.. నవంబర్ 29 నాటికి రూ.74 కోట్లు సెంట్రల్ బ్యాంక్‌కు చేరడం ద్వారా మిగితా రూ.5,743 కోట్లు ఆర్బీఐకి చేరాల్సి ఉంది. 2023 మే 19న ఈ పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అదే ఏడాది అక్టోబర్ 7తో గడువు ముగియగా.. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే రూ.2 నోట్లను స్వీకరిస్తోంది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన సమయంలో కచ్చితమైన గడువు విధించి.. ఆ తర్వాత ఈ నోట్లను స్వీకరించడానికి అంగీకరించలేదు. కానీ.. రూ.2,000 నోట్లకు మాత్రం ఎలాంటి గడువు, పరిమితి విధించకపోవడం గమనార్హం.



