హవాలా నగదు తరలిస్తుండగా పట్టివేత : నార్త్‌జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ వెల్లడి
నవతెలంగాణ-బేగంపేట
గుట్టు చప్పుడు కాకుండా ఓ కారులో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను నార్త్ జోన్ బోయిన్‌పల్లి పోలీసులు వెంబడించి పట్టుకున్నట్టు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ తెలిపారు. నార్త్‌జోన్ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె వివరాలు వెల్లడించారు. గతంలో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ చీటింగ్(రూ.50 లక్షల) కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ కేసులో నిందితులను ట్రేస్ చేస్తుండగా హవాలా డబ్బులు తరలిస్తున్న ముఠా గురించి తెలిసింది. ఈ సమాచారం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుల కోసం బోయిన్‌పల్లి పోలీసులు కాపు కాశారు. నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా వారి వాహనాలను వెంబడించారు. మహబూబ్‌నగర్ అడ్డాకుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని టోల్‌గేట్ వద్ద నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.4 కోట్లా 5 లక్షలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులు ప్రకాష్ మోతిబాయ్ ప్రజాపతి, ప్రగేష్ కీర్తి భాయ్ ప్రజాపతిని అరెస్టు చేశారు. హౌండా క్రెటా అనే కారు సీట్ భాగంలో బాక్స్‌లు సెట్ చేసి అందులో హవాలా డబ్బును తరలిస్తున్నారు. సీజ్ చేసిన డబ్బులను సంబంధిత ఐటీ అధికారులకు అప్పగిస్తామని డీసీపీ తెలిపారు.



