దుర్గ్ సెంట్రల్ జైలులో నన్స్ సిస్టర్స్ ప్రీతీ మేరీ, వందనా ఫ్రాన్సిస్‌లను మా ప్రతినిధి బృందం కలిసింది. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయం పట్ల ఆ ఇద్దరు ప్రదర్శించిన ధైర్యం మమ్మల్ని ఆశ్చర్యపర్చింది. వారితో పాటు అరెస్టయిన ఆదివాసీ యువకుడు సుఖ్‌మాన్ మాండవి గురించి వారు ఎక్కువగా ఆందోళన చెందారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని అత్యంత దయనీయ, ఎలాంటి సౌకర్యాలూ లేని మారుమూల ప్రాం తాల్లో నన్స్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవను అందిస్తున్నారు. వారి ఇన్‌స్టిట్యూషన్స్ ద్వారా క్లీనిక్‌లు, ఆస్పత్రులును నెలకొల్పి కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల పేదలకు సేవనలందిస్తున్నారు. వారు చేస్తున్న నిస్వార్థ సేవకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి జైలుపాలు చేశారు. అవాస్తవ, కల్పిత అభియోగాల కారణంగా నన్స్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నారన్న అభియోగం అబద్ధం. ఎందు కంటే నన్స్‌తో ఉన్న ఆదివాసీలు కూడా చాలా ఏండ్లుగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. అలాంటప్పుడు బలవంతపు మత మార్పిడికి అవకాశం ఎక్కడిది?
మానవ అక్రమ రవాణా విషయానికి వస్తే.. నన్స్‌తో ఉన్న ముగ్గురు ఆదివాసీ యువతులు తాము తమ ఇష్ట పూర్వకంగానే వెళ్తున్నామనీ చెప్పారు. అంతేకాదు వారు వయోజనులేనన్న విషయం వారి ఆధార్‌కార్డులను బట్టి నిరూపితమవుతున్నది. సదరు యువతుల తల్లిదండ్రులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కాబట్టి మానవ అక్రమ రవాణా ఆరోపణ కూడా ఒక అబద్ధం. అయినప్పటికీ నన్స్‌కు బెయిల్‌ను మరింత కష్టతరం చేయటానికి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును నిస్సిగ్గుగా ఎన్‌ఐఏకు పంపింది. ఇక్కడ ఏదైనా బలవంతపు మార్పిడి జరిగి ఉంటే.. అది ఛత్తీస్‌గఢ్‌ను హిందూత్వ రాష్ట్రంగా బలవంతంగా మార్చటమే.
మేము జైలులో నన్స్‌ను కలిసిన తర్వాత నేను వారి చేతులు పట్టుకున్నప్పుడు వారిద్దరికీ జ్వరం ఉన్నట్టు తెలుసుకున్నాను. వారికి కొన్ని దీర్ఘకాలిక రోగ సమస్యలున్నాయి. ఇందుకు వారికి క్రమం తప్పకుండా చికిత్స అవ సరం. కానీ జైలులో వారిని చాలా చలిగా ఉన్న ఫ్లోర్స్ మీద పడుకోబెడుతున్నారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి మరిం త దిగజారింది. నన్స్‌కు బెడ్స్ కల్పించాలనీ, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి సరైన వైద్య చికిత్స అందించాలని మేము జైలు సూపరింటెండెంట్‌తో వాదించాం. ఇదే కేసులో జైలులో ఉన్న ఆదివాసీ యువకుడు సుఖ్‌మాన్ మాండవిని కూడా మేము కలిశాం. వారు మొత్తం సంఘటన క్రమాన్ని మాకు వివరించారు.
ఆగ్రా, భోపాల్, షాహ్‌దోల్‌లలో వారి(నన్స్) ఇన్‌స్టిట్యూషన్స్ కు వంట మనుషుల అవసరం ఉన్నది. గతంలో పని చేసినవారిలో ఒకరైన ఆదివాసీ యువతి సుఖ్‌మతి.. వారి ఆస్పత్రిలో చాలా ఏండ్లపాటు పనిచేసింది. అయితే ఆ యువతికి వివాహం కావటంతో పని వదులుకున్నది. ఆ ఉద్యోగాన్ని చేసేందుకు ఇంకా ఎవరైనా ఉన్నారా అని తెలుసుకునేందుకు ఆమెను సంప్రదించారు. ఇందుకు జీతం రూ.10వేలుగా నిర్ణయించారు. దీంతో సుఖ్‌మతి.. ఈవిషయం గురించి నారాయణ్‌పూర్‌లోని తన గ్రామంలో తనకు తెలిసిన కొన్ని కుటుంబాలకు తెలిపింది. అందుకు వారు సంతోషంగా అంగీకరించారు. ముగ్గురు ఆదివాసీ యువతులు లలిత, కమలేశ్వరితో పాటు సుఖ్‌మతి (మరో యువతి)ని ట్రైనింగ్ కోసం మొదట ఆగ్రాకు, తర్వాత ఏదైనా ఇన్‌స్టిట్యూషన్‌కు ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురు యువతులు అప్పటివరకు జిల్లా కూడా దాటి బయటకు వెళ్లలేదు. దీంతో ఆ ముగ్గురిని దుర్గ్ రైల్వేస్టేషన్ వరకు తీసుకెళ్లేందుకు గతంలో పనిచేసిన సుఖ్‌మతి సోదరుడు సుఖ్‌మాన్ మరాండిని యువతుల తల్లిదండ్రులు వారి వెంట పంపించారు. రైల్వేస్టేషన్‌లో నన్స్‌ను కలిసి, వారు అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లాల్సి ఉన్నది. అయితే స్టేషన్ వద్ద సుఖ్‌మాన్ ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కొనలేదు. వీరిని గమనించిన టిక్కెట్ ఇన్‌స్పెక్టర్ టిక్కెట్లు చూపిం చాలని అడిగారు. అయితే నన్స్ దగ్గర తమ టిక్కెట్లు ఉన్నాయని వారు చెప్పారు. వీరు చెప్పిన మాటలు అక్కడ ఉన్న ఒక భజరంగ్‌దళ్ సభ్యుడి చెవిలో పడ్డాయి. అదే సమయంలో నన్స్ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే భజరంగ్‌దళ్ సభ్యులు అక్కడ గుమిగూడారు.
నన్స్‌ను అరెస్ట్ చేయాలని రైల్వే పోలీసులను డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ గ్రూపును (ఆదివాసీ యువతులు, యువకుడు) రైల్వే పోలీసు కంట్రోల్ రూమ్‌లోకి తోశారు. తాము తమ ఇష్టానుసారమే వెళ్తు న్నామని ఆదివాసీ యువతులు పోలీసులకు చెప్పారు. సుఖ్‌మాన్..ఫోన్‌లో యువతుల తల్లిదండ్రులతో మాట్లాడిం చారు. ఈ మేరకు ఆ యువతుల ప్రయాణానికి తమ సమ్మతి ఉన్నదని పోలీసులకు తల్లిదండ్రులు కూడా చెప్పారు.
అయితే ఇక్కడ ఆరెస్సెస్ ఎజెండా పూర్తిగా అమల్లోకి వచ్చింది. నన్స్.. మా ప్రతినిధి బృందానికి చెప్పిన దానికి మద్దతుగా వీడియో ఆధారాలున్నాయి. పోలీసుల పక్కన ఉన్నా కూడా..దుర్గావాహినికి చెందిన జ్యోతిశర్మ అనే మహిళ నేతృత్వంలోని బజరంగ్‌దళ్ గూండాలు.. వారందరి(నన్స్, ఆదివాసీ యువతులు)పై మాటలతో, శారీరకంగా దాడి చేయటం మొదలు పెట్టారు. నన్స్‌పై చెప్పలేనటువంటి అత్యంత అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగిం చారు. ఇది చట్ట ప్రకారం మౌఖిక లైంగిక దాడి నేరం. వారిని బెదిరించారు. శాపనార్థాలు పెట్టారు. అవమానించారు. ముగ్గురు ఆదివాసీ యువతులపై భౌతికంగా దాడిచేశారు. తమను అక్రమ రవాణా చేస్తున్నారని వాంగ్మూలమివ్వాలని డిమాండ్ చేస్తూ జ్యోతిశర్మ తనను రెండుసార్లు చెంపదెబ్బ కొట్టిందని ఒక యువతి బహిరంగంగానే ప్రకటన చేసింది. ప్రతీ అమ్మాయిని పక్కనే ఉన్న రూమ్‌లోకి విడివిడిగా తీసుకెళ్లి బలవంతంగా ప్రకటనలు ఇచ్చేలా చేశారు. వారు చెప్పినదానికి, పోలీసులు రాసిన దానికి అసలు సంబంధమే లేదు.
పోలీసుల ముందు భజరంగ్‌దళ్, దాని అనుచరులు ఈ విధంగా ప్రవర్తించే సాహసం చేశారంటే దానికి కారణం వారికి బీజేపీ ప్రభుత్వ పూర్తిమద్దతు ఉండటమే. స్పష్టమైన ఆధారాలున్నప్పటికీ.. ఈ దారుణానికి పాల్పడిన వారిపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. దిగువకోర్టులో దాఖలైన బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సెషన్స్‌కోర్టులో అప్పీలు దాఖలు చేస్తే.. బీఎన్‌ఎస్ సెక్షన్ 143 ప్రకారం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేకకోర్టు విచారించాలని ప్రాసిక్యూషన్.. న్యాయమూర్తికి తెలిపింది. 2018లో జాతీయ దర్యాప్తు సంస్థ చట్టాన్ని సవరించిన మోడీ ప్రభుత్వం.. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అప్పటి ఐపీసీ సెక్షన్ 370ని నేరాల షెడ్యూల్‌లో చేర్చింది. ఎందుకంటే మానవ అక్రమ రవాణాకు అంతర్జాతీయ పరిణామాలున్నాయి. అయితే మానవ అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని కేసులనూ ఎన్‌ఐఏ తప్పనిసరిగా దర్యాప్తు చేయాలని అందులో పేర్కొనలేదు. ప్రస్తుత కేసులో దర్యాప్తును స్థానిక పోలీసులే జరిపారు.
స్థానిక కోర్టు మొదట బెయిల్ కోసం దరఖాస్తును విచారించింది. ఆ సమయంలో కేసును ఎన్‌ఐఏకు రిఫర్ చేసినట్టు ప్రాసిక్యూషన్ ప్రస్తావించలేదు. సెషన్స్‌కోర్టులో అప్పీలులో.. కేసును ఎన్‌ఐఏకు రిఫర్ చేసినట్టు ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్‌నూ ప్రాసిక్యూషన్ చూపించలేదు. అయితే వివరాల్లోకి వెళ్లకుండా సెషన్స్‌కోర్టు.. ప్రాసి క్యూషన్ విజ్ఞప్తిని ఎలా అంగీకరించిందన్నది ప్రశ్నార్థకం. ఇది మరొక తీవ్రమైన అన్యాయం. కేసును ఎన్‌ఐఏకు రిఫర్ చేయటం ద్వారా బెయిల్ పొందటం మరింత కష్టతరం చేస్తుంది. ఇది డబులింజిన్ మోడీ ప్రభుత్వ తీరు.
ఈ కేసులో క్రైస్తవ సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవటంతో పాటు మరికొన్ని అంశాలూ ఉన్నాయి. ఇది దేశంలో ఎక్కడికైనా వెళ్లి పని చేసుకోవచ్చని భారత పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కుపై దాడి. క్రైస్తవ మతానికి చెందిన ఒక ఆదివాసీ మహిళ.. వేరే రాష్ట్రానికి ప్రయాణించేందుకు భజరంగ్‌దళ్ వంటి ఆరెస్సెస్ సంస్థతో పాస్‌పోర్ట్ స్టాంప్ వేయించుకోవాలా? వయోజనులైన ఆదివాసీ క్రైస్తవ మహిళలు తాము ఎందుకు, ఎవరితో ప్రయాణిస్తున్నామన్నదానికి రుజువులు, ఆధారాలు ఎందుకు చూపించాలి? ప్రస్తుత కేసు వారి గ్రామాల నుంచి పనికోసం వెళ్లే యువ ఆదివాసీ మహిళల జీవితాలు, జీవనోపాధిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే భయంకరమైన దృష్టాంతాన్ని ఏర్పర్చింది. రెండో అంశం నన్స్, ఆదివాసీ మహిళలపై దాడి స్వభావం. నిర్బంధంలో ఉన్నవారిపై మౌఖిక లైంగికదాడికి సమానమైన భాషను ఎవరైనా ఉపయోగించగలరా? అలాంటివారిపై విచారణ ఉండదా? ఇది మహిళలందరి హక్కులకు సంబంధించిన దాడి.
ధైర్యవంతురాలైన సిస్టర్ ప్రీతి మేరీ తనను కొందరు దుండగులు ‘విదేశీయురాలు’ అని ఆరోపించినప్పుడు, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘చెదపురుగు’ అని పిలిచినప్పుడు బాధపడింది. ‘ఏ సౌకర్యాలూ లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో పేదలు, కుష్టు వ్యాధిగ్రస్తుల కోసం నేను చాలా ఏండ్లు పనిచేసిన తర్వాత కూడా నన్ను దేశ వ్యతిరేక చెదపురుగు అని పిలవాలా? పేదల కోసం పని చేయాలని నా మతం నన్ను ప్రేరేపించింది. దానికి నన్ను శిక్షించాలా?’ అని కన్నీళ్లతో ప్రీతీ మేరీ అడిగింది. భారత హోంమంత్రి బెంగాలీ మాట్లాడే ముస్లింలను ‘అక్రమ వలసదారులు’గా ప్రతీసారి టార్గెట్ చేసే క్రమంలో ఆయన నుంచి ‘చెదపురుగులు’ వంటి పదాలను మనం వింటుం టాం. ఇక్కడ క్రైస్తవ నన్స్‌ను చెదపురుగులుగా పిలుస్తున్నారు. దుర్గ్ సెంట్రల్ జైలులోని ఆ గది మరియు ఢిల్లీలోని బస్తీలు, ఇతర ప్రాంతాల్లో అక్రమ వలసదారులను గుర్తించటం పేరుతో భారత పౌరులు, బెంగాలీ మాట్లాడే ముస్లిం లను వేధించి, హింసిస్తుండటం వంటి విషయాలను గమనిస్తే హిందూత్వ చట్రంలో సరిపోని ప్రతి ఒక్కరినీ విదేశీ యులు అని పిలుస్తారు. వారి హక్కులకు భంగం కలుగుతుంది.
మరోఅడుగు ముందుకేసి, బీహార్‌లో లక్షలాది మంది ఓటర్లను, ప్రధానంగా పేదలు, దళితులు, అణగారిన వర్గాలను ఎన్నికల జాబితాలో ‘శుద్ధి’ చేయటానికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో తొలగించటం కూడా విదేశీయుల గుర్తింపు పేరుతో జరుగుతోంది. గుర్తించబడిన విదేశీయుల సంఖ్య చాలా తక్కువ, కానీ సమకూర్చు కోవటానికి అసాధ్యమయ్యే పత్రాల కోసం ఈసీ డిమాండ్.. ప్రాథమికంగా పేదలు ఎన్నికల్లో ఓటు వేసే ప్రాథమిక హక్కును దోచుకున్నది.
నన్స్, ఆదివాసీ క్రైస్తవులపై జరిగిన భయంకరమైనదాడి, అరెస్టు అరుదుగా జరిగే ఘటన కాదు. పాస్టర్ నీమోల్లర్ చెప్పిన ప్రకారం ‘ఈ రోజు మనం మౌనంగా ఉంటే, రేపు వారు మనకోసం వచ్చినప్పుడు నిరసన తెలిపే వారు ఎవరూ ఉండరు’. యూడీఎఫ్ ఎంపీల ప్రతినిధి బృందం జైలును ఆకస్మికంగా సందర్శిందని మేం విన్నాం. రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నాయకులు పార్లమెంటు వెలుపల ప్లకార్డులు పట్టుకున్నట్టు పత్రికా కథనాలు చూశాం. ఇలా జరగాలి. కానీ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. అక్టోబర్ 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు క్రైస్తవ ఆదివాసీలపై వరుస భయంకరమైన దాడులు జరిగాయి. నారాయణ్‌పూర్‌లోని ప్రధాన క్యాథలిక్ చర్చిపై దాడి జరిగింది. యేసుక్రీస్తు, మదర్ మేరీ విగ్రహాలు ధ్వంసమయ్యాయి. దుర్గ్‌లోని ఇద్దరు నన్స్‌పై దాడి చేసిన ఆరెస్సెస్ సంస్థలకు చెందిన విభాగాలే ఆ సమయంలోనూ బాధ్యత వహించాయి. అప్పుడు నారాయణ్‌పూర్‌కు, ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి దాడికి గురైనవారందరినీ కలిసింది సీపీఐ(ఎం) మాత్రమే. ఆ బృం దంలో నేను ఉన్నాను. మేము కాంగ్రెస్ ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇచ్చాం. కానీ ఆ విషయంలో ఎలాంటి చర్యా తీసుకోలేదు. కాంగ్రెస్ నుంచి ఏ ప్రతినిధి బృందం కూడా బాధిత కుటుంబాలను ఎప్పుడూ సందర్శించలేదు. ఛత్తీస్ గఢ్‌లో కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు బీజేపీపై చేసే పోరాటాన్ని బలహీనపరుస్తాయి. నన్స్‌కు, ఆదివాసీలకు మేం సంఘీభావం నిలుస్తాం. అప్పుడూ ఉన్నాం, ఇప్పుడూ ఉంటున్నాం.
బృందాకరత్