నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాదు జంట నగరాల్లో ఆర్టీసీ ఛార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5 లు, నాలుగవ స్టేజీకి రూ.10ల చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. పెంచిన ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. కొత్త డిపోలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుకు రూ.392 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఛార్జీలను పెంచుతున్నట్లు, అందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా వున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో ఎలక్ట్రికల్ బస్సు చార్జీలను, బస్సు పాస్ చార్జీలను భారీగా పెంచింది. అలాగే పండగల పేరుతో ప్రజల నుండి 50 శాతం ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై మరోసారి అదనంగా భారాలు వేయడం సమంజసం కాదు.
ఆర్టీసీలోనే కార్గో సేవలు కొనసాగాంచాలి..
ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రయివేటీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కార్గో సేవలను ప్రయివేటీకరించాలనే ప్రయత్నాలను విరమించుకొని ఆర్టీసీలోనే కార్గోసేవలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని సీపీఐ(ఎం) సూచించింది.