నవతెలంగాణ – హైదరాబాద్ : బ్రిక్స్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లను రష్యా, చైనాలు తీవ్రంగా ఖండించాయి. బ్రిక్స్ సభ్య దేశాలు మరియు ప్రపంచం మొత్తం మీద సామాజిక ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే వివక్షతతో కూడిన ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా మరియు చైనాలు ఉమ్మడి వైఖరిని తీసుకుంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. షాంఘై కోఆపరేషన్ (ఎస్‌సిఒ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ టియాంజిన్ చేరుకున్న సంగతి తెలిసిందే. చైనా మీడియా జిన్హువా మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అదనపు వనరులను సమీకరించడంపై రష్యా, చైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని మరియు ప్రపంచ సవాళ్లను ఎదుర్కొవడంలో బ్రిక్స్ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఐక్యంగా ఉన్నాయని అన్నారు. బిక్స్ర్ దేశాలపై ట్రంప్ పదిశాతం సుంకాలను విధించిన నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పుతిన్ మాట్లాడుతూ.. రష్యా మరియు చైనా అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచ బ్యాంక్ సంస్కరణలకు మద్దతు ఇస్తున్నాయని అన్నారు. బహిరంగ మరియు నిజమైన సమానత్వం సూత్రాలపై కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే అభిప్రాయాన్ని ఇరుదేశాలు పంచుకుంటాయని, ఇది అన్ని దేశాల అభివృద్ధికి సమానంగా మరియు వివక్షత లేని అవకాశాన్ని అందిస్తుందని అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సభ్యదేశాల వాస్తవ స్థితిని ప్రతిబింబిస్తుందని అన్నారు. సమస్త మానవాళికి ప్రయోజనం చేకూరేలా తాము పురోగతిని కోరుకుంటున్నామని, రష్యా, చైనాలు ఈ గొప్ప లక్ష్యం వైపు కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. ఇరు దేశాల పురోగతిని నిర్థారించడానికి మన ప్రయత్నాలను ప్రారంభిస్తామని అన్నారు.
ఎస్‌సిఒ సదస్సుకు హాజరుకావడం, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు జరపడంతో పాటు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయపు 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చైనా నిర్వహించే వి.పరేడ్‌లో పాల్గొననున్నారు.