Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఆటలుసబలెంక, ఆమంద

సబలెంక, ఆమంద

- Advertisement -

మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ఢీ
సెమీఫైనల్లో సాధికారిక విజయాలు

యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2025

మహిళల సింగిల్స్‌ టైటిల్‌ వేటలో అరినా సబలెంక (బెలారస్‌), ఆమంద ఆనిషిమోవ (అమెరికా) సమరానికి సై అంటున్నారు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో వరల్డ్‌ నం.1 సబలెంక, ఎనిమిదో సీడ్‌ ఆమంద మెరుపు విజయాలు నమోదు చేశారు. జపాన్‌ స్టార్‌ నవొమి ఒసాకకు న్యూయార్క్‌లో నిరాశ తప్పలేదు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నేడు జకోవిచ్‌ (సెర్బియా)తో అల్కరాస్‌ (స్పెయిన్‌).. సినర్‌ (ఇటలీ)తో ఫెలిక్స్‌ (కెనడా) తలపడనున్నారు.

నవతెలంగాణ-న్యూయార్క్‌
మహిళల సింగిల్స్‌ ప్రపంచ నం.1 అరినా సబలెంక (బెలారస్‌) యుఎస్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో నాల్గో సీడ్‌ అమెరికా అమ్మాయి జెస్సికా పెగులాపై 4-6, 6-3, 6-4తో సబలెంక మెరుపు విజయం సాధించింది. రెండు గంటల పాటు సాగిన సెమీఫైనల్లో తొలి సెట్లో సబలెంకపై పెగులా పైచేయి సాధించింది. తొలి సెట్లో రెండు సార్లు సబలెంక సర్వ్‌ను బ్రేక్‌ చేసిన జెస్సికా పెగులా.. టాప్‌ సీడ్‌కు అదిరే పంచ్‌ ఇచ్చింది. కీలక రెండో సెట్లో సబలెంక గొప్పగా పుంజుకుంది. స్వీయ సర్వ్‌ను నిలుపుకుంటూ.. ఓసారి పెగులా సర్వ్‌ను బ్రేక్‌ చేసింది. 3 ఏస్‌లు, 15 విన్నర్లతో రెండో సెట్లో సత్తా చాటింది. ఆరంభంలోనే 3-0తో నిలిచి పెగులాపై ఒత్తిడి పెంచింది. 6-3తో రెండో గేమ్‌ నెగ్గి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. చావోరేవో తేల్చుకోవాల్సిన మూడో సెట్లో సబలెంక ఉత్తమ ప్రదర్శన చేసింది. 3 ఏస్‌లు, 17 విన్నర్లకు తోడు ఓ బ్రేక్‌ పాయింట్‌తో దూకుడుగా ఆడింది. మూడో సెట్లో పాయింట్ల పరంగా 33-31తో పెగులా పైచేయి సాధించినా.. సబలెంక 6-4తో సెట్‌తో పాటు ఫైనల్లో బెర్త్‌ను ఎగరేసుకుపోయింది. మహిళల సింగిల్స్‌ మరో సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌, అమెరికా అమ్మాయి ఆమంద అనిషిమోవ మురిసింది. జపాన్‌ స్టార్‌ నవొమి ఒసాకపై 6-7(4-7), 7-6(7-3), 6-3తో అనిషిమోవ గెలుపొందింది. మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఆమందకు తొలి సెట్లో భంగపాటు తప్పలేదు. టైబ్రేకర్‌కు దారితీసిన తొలి సెట్‌ను ఒసాక సొంతం చేసుకుంది. రెండో సెట్‌ సైతం టైబ్రేకర్‌కు వెళ్లినా.. ఈసారి ఒత్తిడిలో ఆమంద పైచేయి సాధించింది. నిర్ణయాత్మక మూడో సెట్లో ఆమంద 6-3తో స్పష్టమైన పైచేయి సాధించింది. ఒసాక 15 ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెరువగా.. ఆమంద ఏడు ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లతో రాణించింది. ఒసాక 27 అనవసర తప్పిదాలు చేయగా.. ఆమంద 45 అనవసర తప్పిదాలకు పాల్పడింది. ఆమంద 50 విన్నర్లు గెల్చుకోగా.. ఒసాక 32 విన్నర్లతోనే సరిపెట్టుకుంది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో వరల్డ్‌ నం.1 అరినా సబలెంకతో అమెరికా యువ కెరటం ఆమంద అనిషిమోవ తలపడనుంది.
యూకీ జోరుకు బ్రేక్‌
యుఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకుని సత్తా చాటిన భారత ఆటగాడు యూకీ బాంబ్రి.. శుక్రవారం నాటి సెమీస్‌ మ్యాచ్‌లో పరాజయం పాలయ్యాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మైకల్‌ వేనస్‌తో కలిసి బరిలోకి దిగిన యూకీ బాంబ్రి.. ఆరో సీడ్‌ బ్రిటన్‌ జోడీ నీల్‌, జోతో పోరులో 7-6(7-2), 6-7(5-7), 4-6తో మూడు సెట్లలో పోరాడి ఓడాడు. ఏడు ఏస్‌లు, రెండు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన యూకీ, మైకల్‌ జోడీ.. పాయింట్ల పరంగా 35-41తో గట్టి పోటీ ఇచ్చారు. తొలి రెండు సెట్లు టైబ్రేకర్‌కు దారితీయగా.. రెండో సెట్లో యూకీ జోడీ తడబాటుకు గురైంది. నిర్ణయాత్మక మూడో సెట్లో బ్రిటన్‌ జోడీ పైచేయి సాధించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad