కన్నుతెరిస్తే జననం…కన్ను మూస్తే మరణం…ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం…మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక ఉత్కృష్ట సేవాయజ్ఞం. ఆత్మీయుడిని కోల్పోయిన పెనువిషాదంలో ఉన్నప్పటికీ అతడి అవయవదానానికి ముందుకొచ్చి పెద్దమనసు చాటుకుంటున్న కుటుంబీకుల సేవాస్ఫూర్తి మహోన్నతం. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి నిత్యచేతనంగా నిలుస్తాయన్న భావనే వారి కార్యశీలతలోని నిగూఢార్థం. ఒకరికి గుండె, ఒకరికి ఊపిరితిత్తులు, మరొకరికి కళ్లు, ఇంకొకరికి మరో అవయవం.. ఇలా అవయవాల కోసం నిరీక్షిస్తున్న ఆపన్నులెందరో! వారి అవసరాలను తీర్చేందుకు ‘జీవన్‌దాన్’ అనుసంధానకర్తగా నిలుస్తోంది. ప్రస్తుతం దేశంలోనే ‘అత్యధిక సంఖ్యలో అవయవ దాతలు ఉన్న రాష్ట్రం’గా తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. ఇది నిజంగా గొప్ప విషయం. దాతృత్వానికి నిజమైన అర్థంగా నేడు తెలంగాణ రాష్ట్రం నిలవడం మనందరికీ గర్వకారణం.
దానాలన్నిట్లోకెల్లా ఫలానా దానమే గొప్పదని తరచూ అంటుంటాం. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి విద్యాదానమనీ, అన్నదానమనీ, ఇలా ఆ పేరు మారుతుంటుందంతే. కానీ ఎప్పటికీ మారని గొప్పదానం ప్రాణదానం. దానికి దోహదపడేదే అవయవదానం. ఆధునిక వైద్య శాస్త్రంలోని పురోగతి వల్ల ఇప్పుడు అవయవాలను మార్చి ప్రాణాలను నిలబెట్టగల సామర్థ్యం మన వైద్యులకు ఉంది. అయితే జీవించి ఉన్నవారు తమ అవయవాలను ఎలా ఇవ్వగలరు? అందుకే జీవన్మృతుల (బ్రెయిన్‌డెడ్ పర్సన్స్) నుంచి అవయవాలను సేకరించే అవకాశాన్ని కల్పించేలా మనం చట్టబద్ధమైన మార్గదర్శకాలనూ ఏర్పాటు చేసుకున్నాం. కానీ, మరణానంతరం వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు గల సాంప్రదాయపు ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహనాలోపం తదితర కారణాల వల్ల అవయవదానం చేయడానికి అందరూ అంగీకరించకపోవడం వంటి కారణాలు అవాంతరాలుగా ఉన్నాయి. వాటిని పారదోలేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి. స్వచ్ఛంద బ్లడ్‌బ్యాంకులాగా, స్వచ్ఛంద అవయవదాన కేంద్రాలు కూడా పెరగాలి. మేధావులు, ప్రజాసంఘాలు కూడా అవయవ దానంపై ప్రచారం చేయడం ద్వారా ఆవగహన పెంచే ప్రయత్నం చేయాలి.
ఏటా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో లక్షన్నర మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో కొందరి అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకొచ్చినా కీలక అవయవాల కొరత తీరుతుంది. 2017లోనే అవయవదానాన్ని ఫ్రాన్స్ దేశం తప్పనిసరి చేసింది. ఎవరికైనా ఇష్టం లేకపోతే ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి. లేదంటే వ్యక్తి చనిపోగానే వైద్యులు తప్పనిసరిగా వారి అవయవాల్ని సేకరిస్తారు. డెన్మార్క్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అవయవదానంపై ముందే ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ, మన కేంద్ర ప్రభుత్వం అవయవాలను త్వరితగతిన తరలించేందుకు గ్రీన్ కారిడార్‌లను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేసిందే తప్ప దాని ప్రాధాన్యతను గుర్తించి సరైన అవగాహన కల్పించే చర్యలు మాత్రం చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంలో కిందా మీదా పడుతూ… దాతలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపడుతున్నాయి. మన రాష్ట్రంలో యువత సైతం పుట్టినరోజు, పెండ్లిరోజులాంటి ప్రత్యేక సందర్భాల్లో అవయవ దాతలుగా పేరు నమోదు చేసుకుంటున్నారు. ఇదొక మంచి పరిణామం.
ఓ వైపు అవయవాలకోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటే- చాలాచోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో జీవన్మృతుల కేసులొస్తున్నా సరిగ్గా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. తమకు అదనపు భారమవు తుందని భావించడం ఒక కారణమైతే వైద్యుల కొరతను సాకుగా చూపించి ఆస్పత్రులు మహాశయానికి గండికొడుతున్నాయి. ప్రయివేటు వైద్యాలయాలూ ఇందుకు మినహాయింపు కాదు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో ఎనిమిది మందిని బతికించే అవకాశం ఉంది. బ్రెయిన్ డెడ్ కేసు రాగానే వైద్యులు ముందుగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవదానం ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలి. అందుకు వారు సమ్మతించేలా చూడాలి. వంద పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి జీవన్‌దాన్ ట్రస్ట్‌లో నమోదు చేసుకోవాలి. చాలాచోట్ల అది జరగడం లేదు. ఈ తీరు మారాలి. అవయవదానం విషయంలో ఆస్పత్రులు, వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మరోవైపు, కీలక అవయవాల కొరతను ఆసరాగా చేసుకుని దేశంలో అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న అభాగ్యులు ఇలాంటి నేర ముఠాల మాయలో పడి తీవ్రంగా నష్ట పోతున్నారు. అవయవ అక్రమ దందాసురులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. మరణానం తర అవయవదానం ఎందరికో ప్రాణభిక్ష పెడుతుందనే అంశాన్ని ప్రతిఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియ జేయాలి. అందరూ అవయవదానానికి ముందుకు రావాలి.అప్పుడే దినమొక గండంగా మారినవారి జీవితాల్లో నవ వసంతాలు విరబూస్తాయి.
జీవన్మృతుల త్యాగనిరతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES