Saturday, November 1, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిదు:ఖ'మొంథా'

దు:ఖ’మొంథా’

- Advertisement -

ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట కండ్లముందే కొట్టుకు పోయింది. రైతుల కన్నీటిధార కూడా ఆ ప్రవాహంలోనే కలిసిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వరితలలు కూలిపోయాయి, పత్తి మొలకలు చిత్తయ్యాయి. ఇది కొత్తేం కాదు. గతేడాది ఫెంగల్‌, అంతకు ముందు మిథిలి, ఆపై మిచాంగ్‌, అంఫన్‌ లాంటి వరుస తుఫాన్‌లు జనజీవనాన్ని స్తంభింపజేసినా, పంటలను నష్టపరిచినా ప్రభుత్వాలు మాత్రం గుణపాఠం నేర్చింది లేదు. ఫలితంగా వర్షాలు ఊహించని రీతిలో రైతుల్ని నిలువునా ముంచాయి. మౌలిక సదుపాయాల లేమి, తక్షణ చర్యల లోపంతో పాటు సర్కార్‌ చేష్టలూడిగినతనాన్ని తెటతెల్లం చేశాయి. రాష్ట్రంలో దాదాపు పద్నాలుగు జిల్లాలపై తుఫాన్‌ విరుచుకుపడింది. వరంగల్‌, సిద్దిపేట, ఖమ్మం, నల్లగొండ, జనగాం, సూర్యాపేట జిల్లాల్లో తీవ్రనష్టం కలిగించింది.

వర్షాల హెచ్చరికల నేపథ్యంలో పంటలను ముందు గానే సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆరబోసిన ధాన్యంపై టార్ఫాలిన్‌ కవర్లు కప్పడం లాంటివి చేస్తే బాగుండేది. కానీ ఆ దిశగా అధికార యంత్రాంగం ముందుకు కదల్లేదు. దీంతో నాలుగున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలకు, ధాన్యానికి నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వ నివేదికల సారాంశం. దీని ప్రభావం సుమారు రెండున్నర లక్షల మంది రైతులపై పడింది. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. ప్రభుత్వ భాష్యం మాత్రం ‘అధికారులు పరిశీలిస్తున్నారు’ అనే చల్లని మాటలే. ఎకరాకు రూ.పదివేల నష్ట పరిహారం ప్రకటించి బాధను దాచేస్తే సరిపోతుందా? నీటిలో మునిగిపోయిన జీవితాలకు అది పరిహారమా? ఇది అన్యాయం, అవమానం కూడా. ఆరు నెలల కాయకష్టం, ఎరువుల కోసం ఎదురుచూపు, బీమా లేకపోవడం, మార్కెట్‌లో ధరల పతనం, ఇవన్నీ కలిసి రైతుల్ని ఛిద్రం చేస్తే వారి జీవితాలు ఏమైపోవాలి? నిత్యం ‘రైతే దేశానికి వెన్నెముక’ అని చెప్పడం కాదు, వారి వెన్ను విరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే కదా!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి, కలెక్టర్‌ వరద ప్రాంతాల్ని సందర్శిస్తున్న సమయంలోనే ఓ మహిళా రైతు కొట్టుకు పోయిన ధాన్యాన్ని డ్రెయినేజీలో నుంచి తీస్తుండటం రైతుల దుస్థితిని తెలియజేస్తున్నది. ‘కట్టమంతా వరదపాలైంది. మేమవ్వరికి చెప్పుకో వాలే? ఎట్టా బతకాలే? మాకు దిక్కెవరు సారూ’ అంటూ మంత్రి, అధికారుల కాళ్ల మీద పడి బోరున విలిపించిన తీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. అయితే వ్యవసా యాధికారులు ధాన్యానికి పదిహేడు శాతం మ్యాచర్‌ వస్తేనే కొంటామని చెప్పడంతో రైతులు తమ వడ్లను పదిహేను రోజులుగా మార్కెట్‌ యార్డుల్లో ఆరబోస్తూ అక్కడే పడిగాపులు కాస్తున్నారు. వాతావరణం దృష్ట్యా కొనుగోలు చేయాలని అధికారులతో ఎంత మొత్తుకున్నా వారి కాఠిన్యత ముందు వీరి వేదన ఎందుకూ పనికి రాలేదు. తీరా మొంథా ధాటికి ధాన్యమంతా తడిసి తీరని వ్యథను మిగిల్చింది. రెండుచేతులు జోడించి కనపడ్డవారి నల్లా ‘ఆదుకోండి సారూ’ అని వేడుకుంటున్న ఈ వెన్నెముకలు విరగకుండా చూడాల్సింది సర్కారే కదా! పంటనష్టపోయి చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క రైతేకాదు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు ఇప్పుడు వరదలో కొట్టుకుపోవడంతో వారంతా పుట్టెడు దు:ఖంలో ఉన్నారు.

ఈ తుఫాన్‌ రైతుల్ని మాత్రమే కాదు, అనేక కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సిద్దిపేటలోని అక్కన్నపేట మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న మోత్కులపల్లి వాగులోనుంచి బైక్‌పై వస్తున్న నవ దంపతులు గల్లంతై చనిపోయారు. అదే ప్రాంతంలో అప్పటివరకు అందరితో గడిపిన ఓ యువకుడు వాగుదాటుతూ మృతి చెందాడు. ఖమ్మం జన్నారం నిమ్మవాగులో వ్యాన్‌తో సహా డ్రైవర్‌ కొట్టుకు పోయాడు. ఇవి మచ్చుకు మాత్రమే. వెలుగు చూడని విషాద గాథలు ఇంకెన్నో. ఈ ఘటనలపర్వం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ట. ఎడతెరిపి లేని వానల గురించి హెచ్చరికలు చేస్తే సరిపోదు. పొంగిపొర్లుతున్న వాగులు, చెరువుల దగ్గర కనీస భద్రతను కల్పించాలి. నల్లగొండ జిల్లాలో గురుకుల విద్యార్థులు ఒకరిచేయి పట్టుకుని ఒకరు పరిసర ప్రాంగణాన్ని దాటడం వరద తాకిడికి నిదర్శనం. హైదరాబాద్‌ మహానగరం, ఖమ్మం, వరంగల్‌ లోనైతే నివాసాల్లోకి వర్షపునీరు వచ్చి, కాలనీల్లో వరద పోటెత్తడం, డ్రెయినేజీలు సైతం పొంగిపొర్లడంతో చాలా మంది ఇండ్లలోనుంచి బయటకు రాలేదు. రైళ్లను కూడా రద్దు చేశారు. ప్రతియేటా ఇదే పరిస్థితి ఎదురవుతున్నా ముందస్తు నివారణ చర్యల దిశగా సర్కార్‌ ఆలోచించడం లేదు. మొంథా ఒక తీవ్రమైన గాలివాన కాదు, ఒక గుణపాఠం. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరవాలి. నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి. రైతు రోదన పాలకుల మౌనాన్ని కదిలించకపోతే భారతదేశం భవిష్యత్తునే కొల్పోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -