భారత్, దక్షిణాఫ్రికా ఢీ నేడు
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్
మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ పోరు విశాఖ తీరానికి చేరుకుంది. ఆతిథ్య భారత్ ఇక్కడ రెండు అగ్రజట్లతో తలపడనుంది. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో పలు సమస్యలు ఎదురైనా.. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచుల్లో హర్మన్‌ప్రీత్ సేన అదిరే విజయాలు సాధించింది. ఇక నుంచి భారత్ వరుసగా మూడు అగ్రజట్లు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. సెమీస్ రేసులో పోటీపడుతున్న జట్లతో పోరులో ఏ చిన్న పొరపాటు చేసినా.. మ్యాచ్ ఫలితంలో ప్రతిబింబిస్తుంది. అందుకే, నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శన కనబరిచేందుకు టీమ్ ఇండియా సిద్ధమవుతోంది.
నవతెలంగాణ-విశాఖపట్నం
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో విజయం సాధించటమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్.. ప్రధానంగా స్మతీ మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రొడ్రిగస్‌లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. శ్రీలంక, పాకిస్తాన్‌లతో మ్యాచుల్లో భారత్ ఘన విజయాలు సాధించినా.. ఈ ముగ్గురులో ఏ ఒక్కరూ అంచనాలను అందుకోలేదు. టాప్ ఆర్డర్‌లో ఆశించిన భాగస్వామ్యాలు నమోదు కాలేదు. రెండు మ్యాచుల్లోనూ తొలి ఐదు వికెట్లు పేకమేడలా కుప్పకూలాయి. అయినా, లోయర్ ఆర్డర్ మెరుపులతో భారత్ మంచి స్కోర్లు సాధించింది.
బౌలర్ల సమిష్టి విజృంభణతో ఘన విజయాలు ఖాతాలో వేసుకుంది. రెండు మ్యాచుల్లోనూ భారీ విజయాలు సాధించి మెరుగైన్ నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. అయినా, భారత శిబిరంలో ఏదో ఆందోళన. కీలక బ్యాటర్ల వైఫల్యం, తుది జట్టు కూర్పు, ఫీల్డింగ్ లోపాలు భారత్‌ను వేధిస్తున్నాయి. నేడు విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సెమీఫైనల్ బెర్త్ రేసులో సఫారీలు సైతం ముందంజలో ఉన్నారు. మేటి జట్లపై మెరుగైన ప్రదర్శన చేయగలిగితేనే మెగా ఈవెంట్లలో విజేతలుగా నిలిచేందుకు ఆస్కారం ఉంటుంది. స్వీయ లోపాలను సరిదిద్దుకుని సఫారీలపై విజయమే లక్ష్యంగా భారత్ నేడు బరిలోకి దిగుతోంది.
మంధాన మెరిసేనా?
స్మతీ మంధాన భీకర ఫామ్‌తో వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టింది. ఆసీస్‌పై రికార్డు వేగవంతమైన సెంచరీ సాధించింది. అయినా, తొలి రెండు మ్యాచుల్లో మంధాన వరుసగా 8, 23 పరుగులే చేసింది. మంధాన వైఫల్యంతో పవర్‌ప్లేలో భారత్ తేలిపోతుంది. శ్రీలంకపై 43, పాకిస్తాన్‌పై 54 పరుగులే పవర్‌ప్లేలో చేశారు. యువ ఓపెనర్ ప్రతీక రావల్ సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రొడ్రిగస్ సైతం వరుస మ్యాచుల్లో విఫలమయ్యారు. ఫలితంగా శ్రీలంకతో మ్యాచ్‌లో 124/6, పాకిస్తాన్‌తో మ్యచ్‌లో 159/4తో భారత్ కష్టాల్లో కూరుకుంది.
లోయర్ ఆర్డర్ ఆదుకోకుంటే.. టీమ్ ఇండియా పరిస్థితి భిన్నంగా ఉండేది. ఆరంభంలో ధనాధన్ జోరు చూపించే స్మతీ మంధాన మెరిస్తే భారత బ్యాటింగ్ కష్టాలకు తెరపడనుంది. తొలి 15-20 ఓవర్లలో ప్రత్యర్థి బౌలర్లపై మంధాన విరుచుకుపడితే.. నీరసించిన బౌలింగ్ దళంపై మిడిల్ ఆర్డర్ అలవోకగా పైచేయి సాధించగలదు. ఆరంభంలోనే ప్రధాన బ్యాటర్ నిష్క్రమించటంతో భారత్ డీలా పడటంతో పాటు ప్రత్యర్థి జట్టు ఉత్సాహం రెట్టింపు అవుతోంది. పరుగుల వేటలో మంధాన మెరిస్తే.. బ్యాటింగ్ ఆర్డర్ సమస్యలకు చెక్ పడినట్టే భావించాలి.
కూర్పు కుదిరినా?
శ్రీలంక, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో భారత్ ఐదుగురు బౌలర్లలో బరిలోకి దిగింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ భీకర ఫామ్‌లో ఉంది. స్పిన్ త్రయం దీప్తి శర్మ, స్నేహ్ రానా, శ్రీ చరణి మాయాజాలం ముంగిట వికెట్లు నేలకూలుతున్నాయి. ఆల్‌రౌండర్లు సహా భారత్ ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లనే ప్రయోగించింది. సఫారీ వంటి అగ్ర జట్లను ఢీకొీట్టేందుకు ఆరుగురు బౌలర్లు అవసరం అవుతారు. లేదంటే లక్ష్యాలను కాపాడుకోవటం గగనం అవుతుంది. విశాఖలో ఫ్లాట్ వికెట్ ఉండనుండటంతో ఆరుగురు బౌలర్ల డిమాండ్‌కు మద్దతు ఎక్కువవుతోంది. జ్వరంతో పాక్‌తో మ్యాచ్‌కు దూరమైన ఆల్‌రౌండర్ ఆమన్జోత్ కౌర్ విశాఖలో బౌలింగ్, బ్యాటింగ్ సాధన చేసింది. శ్రీలంకపై ఆమె గొప్పగా రాణించింది. పాక్‌తో మ్యాచ్‌లో ఆడిన రేణుక సింగ్ సైతం మెప్పించింది. దీంతో తుది జట్టు కూర్పు భారత్‌కు సవాల్‌గా మారింది.
ఆ బలహనత దాటేదెలా?
భారత మహిళల జట్టు లెఫ్టార్మ్ స్పిన్నర్ బలహీనత ఎదుర్కొంటున్నారు. శ్రీలంకతో మ్యాచ్‌లో ఐనోక రణవీర, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో సాదియ ఇక్బాల్‌లు మాయాజాలం చేశారు. రణవీర మాయకు భారత్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. సాదియ ఇక్బాల్ సైతం అదే తరహా మ్యాజిక్‌తో భారత బ్యాటర్లను ఇరకాటంలో పడేసింది. టాప్ ఆర్డర్‌లో మంధాన, హర్మన్‌ప్రీత్, జెమీమా సహా ఏ ఒక్క బ్యాటర్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవటం లేదు. భారత్ ఈ సమస్యను వీలైనంత వేగంగా సరిదిద్దుకోవాలి. సఫారీ శిబిరంలో ఓ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉంది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇండోర్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపు తిప్పింది. నేడు విశాఖలోనూ భారత్‌ను ఇరకాటంలో పడేసేందుకు సఫారీలు లెఫ్టార్మ్ స్పిన్నర్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సవాల్‌కు భారత్ సిద్దమేనా?!.