రూ.13వేల కోట్ల షేర్ల ఉపసంహరణ
కేంద్రం కసరత్తు
త్వరలో రోడ్‌షోలు ఏర్పాటు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని దిగ్గజ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో మరోమారు భారీగా వాటాలను ఉపసంహరించుకోవాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం కసరత్తును వేగవం తం చేసినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఇంతక్రి తంతో పోల్చితే రెట్టింపు వాటాలను మార్కెట్ శక్తులకు విక్రయించడానికి వీలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఏడాది ముగింపు లోపే 6.5 శాతం వాటాలను విక్రయించడానికి కేంద్రం ఏర్పాటు చేస్తోందని ఎకనామిక్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ వాటాల ఉపసంహరణ ద్వారా కేంద్రం రూ.8,800 కోట్ల నుంచి రూ.13,200 కోట్లు తన ఖజానాలో వేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ మొత్తం విలువ చేసే షేర్లను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టనుంది. వాటాల విక్రయం కోసం వచ్చే కొద్ది వారాల్లోనే రోడ్‌షోలను నిర్వహించనుంది.
2022లో ఎల్‌ఐసీ ఐపీఓకు వచ్చిన సమయంలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో రూ.20,557 కోట్ల నిధులను కేంద్రం తమ ఖజానాలో వేసుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్‌ఐసీలో 96.5 శాతం వాటా ఉంది. కాగా.. 2027 నాటికి ఇందులో కనీసం 10 శాతం వాటాను ప్రయివేటు శక్తులకు కట్టబెట్టాలని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సెబీ నిబంధనలను సాకుగా చూపుతోంది. 2027 మే నాటికి ఎల్‌ఐసీలో కనీసం 10 శాతం వాటాలను విక్రయించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆదేశాలున్నాయని పదేపదే గుర్తు చేస్తోంది. ఈ వాటాలను చిన్న విడతలుగా.. మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా క్రమంగా విక్రయించాలనేది ప్రభుత్వ వ్యూహం.
2027 నాటికి 10 శాతం వాటాలను విక్రయించడం ద్వారా మొత్తంగా రూ.37వేల కోట్లకు పైగా సమీకరించాలని మోడీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అయితే ఇన్వెస్టర్లు, మార్కెట్‌పై ఒత్తిడి రాకుండా ఈ షేర్లను క్రమంగా, భాగాలుగా విక్రయించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇలా చేయడం ద్వారా ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల విలువను కాపాడాలని భావిస్తోంది. ‘ప్రస్తుత త్రైమాసికం ముగింపులోపే మరోమారు ఎల్‌ఐసీలో వాటాల విక్రయం జరగొచ్చు’ అని ఓ మర్చంట్ బ్యాంకర్ తెలిపారు. మంగళవారం ఎల్‌ఐసీ షేర్ ధర రూ.911.50 వద్ద ముగిసింది. దీంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.5.75 లక్షల కోట్లకు చేరింది.
ఎల్‌ఐసీ వాటాల విక్రయ ప్రక్రియను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపమ్) నడిపిస్తోంది. తదుపరి విక్రయం గడువు, వాటా ఉపసంహరణ మొత్తాన్ని ఖరారు చేయడానికి చర్చలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వాటాల ఉపసంహరణ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ) ద్వారా జరగాలా, లేక ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ముందుకు తీసుకెళ్లాలా అనేది త్వరలో జరిగే రోడ్‌షోలలో పెట్టుబడిదారుల డిమాండ్ ఆధారంగా నిర్ణయించనున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయన్నారు.



