నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలోని వేణు కాంప్లెక్స్ పైన విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కావడంతో సెలూన్ షాపు పూర్తిగా దగ్ధమైంది. గుండ్ల గూడెం గ్రామానికి చెందిన బొప్పాపురం కిష్టయ్య జీవనోపాధి కోసం వేణు కాంప్లెక్స్ పైన షట్టర్ కిరాయికి తీసుకొని దాదాపు 30 సంవత్సరాలుగా నాయి బ్రాహ్మణ వృత్తి, కటింగ్, గడ్డం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
మంగళవారం రాత్రి సమయంలో షాప్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే షాపు మొత్తం దగ్ధమైంది. రూ.10 లక్షల నష్టం జరిగిందని బాధితుడు కిష్టయ్య పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ క్రమంలో షార్ట్ సర్రూట్ ప్రమాదం గూర్చి సమాచారం అందుకున్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం నుండి తగిన విధంగా నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నాడు. నష్టపోయిన కుటుంబం అధైర్య పడుద్దని కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.