వేలాడుతున్న ట్రంప్ కత్తి
ద్వైపాక్షిక బిల్లులో హెచ్చరిక
వాషింగ్టన్ : రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఆంక్షలు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సిద్ధపడ్డారు. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక బిల్లుకు ఆయన ఆమోదముద్ర వేశారు. చమురు కొనుగోలు ద్వారా ఉక్రెయిన్‌లో రష్యా జరుపుతున్న యుద్ధానికి ఆయా దేశాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయని ట్రంప్ చాలా కాలంగా ఆరోపణ చేస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో తాను బుధవారం సమావేశమైన తర్వాత బిల్లును ఆయన ఆమోదించారని రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రహం వెల్లడించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీగా వాణిజ్య జరిమానాలు విధించడమే ఈ బిల్లు ఉద్దేశమని ఆయన చెప్పారు. ‘ఎస్.1241-ది శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025’ పేరిట గ్రహం, డెమొక్రటిక్ సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రష్యాను, ఆ దేశం నుంచి రాయితీ రేటుతో చమురు-ఇతర ఇంధన ఉత్పత్తులు కొనుగోలు చేస్తూ మాస్కో ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న దేశాలను ఈ బిల్లు లక్ష్యంగా చేసుకుంది.
ఈ బిల్లుపై గ్రహం రిపబ్లికన్లు, డెమొక్రాట్లతో అనేక నెలలుగా కసరత్తు చేస్తున్నారు. బిల్లులోని సెక్షన్ 17 ప్రకారం…రష్యా నుంచి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులు, సేవలపై కనీసం 500 శాతం సుంకాన్ని విధించే అధికారం దేశాధ్యక్షుడికి ఉంటుంది. బిల్లుకు త్వరలోనే బలమైన మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు గ్రహం తెలిపారు. కాగా బిల్లును ఓటింగ్‌కు రాకుండా సెనెట్, నాయకులు ఇప్పటి వరకూ నిలువరిస్తూ వస్తున్నారు. విస్తృత స్థాయిలో ఆంక్షలు విధించే కంటే భారత్ నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై సుంకాలు మాత్రం విధించాలని ట్రంప్ భావిస్తుండడం దీనికి కారణం. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ కొనసాగించిన పక్షంలో అధిక సుంకాలను ఎదుర్కోవాల్సిన వస్తుందని ట్రంప్ ఇటీవలే హెచ్చరిక జారీ చేశారు. ప్రధాని మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆయన విషయంలో తాను సంతోషంగా లేనని చెప్పారు. తనను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందని కూడా తెలిపారు.



