ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా
యదేచ్చగా ఇసుక తరలింపు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-పాలకుర్తి
ఎన్నికలను ఆసరాగా తీసుకుంటున్న ట్రాక్టర్ యజమానులు ఇందిరమ్మ ఇండ్ల పేరుతో యదేచ్చగా ఇసుక దందా ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను తీసుకు వెళ్ళుచున్నామనే సాకుతో బుధవారం మండలంలోని ముత్తారం, వల్మిడి గ్రామ శివారులో గల వాగు నుండి ఇసుక దందా జోరుగా సాగుచున్నది. ఇసుక అక్రమ దందాను అరికట్టాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటూ పర్యవేక్షించకపోవడంతో ఇదే అదునుగా భావించిన ట్రాక్టర్ యజమానులు అక్రమ ఇసుక దందాకు యదేచ్ఛగ పాల్పడ్డారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులతో పాటు పంచాయతీ కార్యదర్శులు కూపన్లు అందిస్తేనే ఇసుకకు అనుమతులు ఉన్నాయి.
ఎలాంటి కూపన్లు లేకుండానే ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో ఇసుక దందా జోరందుకుంది. అధికారులు అందుబాటులో లేకపోవడం ట్రాక్టర్ యజమానులు అక్రమ ఇసుక దందాకు రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలించడంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల రైతులు ఆందోళన చెందుచున్నారు. ఇందిరమ్మ ఇండ్ల ముసుగులో అక్రమ ఇసుక దందాకు పాల్పడుచున్న ట్రాక్టర్ యజమానులపై చర్యలు చేపట్టి ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ఆయా గ్రామాల ప్రజలు అధికారులను కోరారు.



