నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తనను జట్టు నుంచి విడుదల (రిలీజ్) చేయాలని లేదా మరో జట్టుకు బదిలీ (ట్రేడ్) చేయాలని అతడు యాజమాన్యానికి అధికారికంగా విజ్ఞప్తి చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త ఐపీఎల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి, సంజు శాంసన్‌కు మధ్య సంబంధాలు సజావుగా లేవని సమాచారం.
వీరి మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తాయని, ఈ విషయాన్ని సంజు కుటుంబ సభ్యులతో పాటు అతడికి సన్నిహితంగా ఉండే కొందరు క్రికెటర్లు సైతం ప్రస్తావించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. “సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌తో కొనసాగాలని అనుకోవడం లేదు. అందుకే తనను రిలీజ్ చేయాలని కోరాడు,” అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు సంజు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గత మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతడిని ఏకంగా రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుని తమ కీలక ఆటగాడిగా ప్రకటించుకుంది.
అలాంటి ఆటగాడు ఇప్పుడు జట్టును వీడాలనుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సంజు శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆసక్తి చూపుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంజు వేలానికి అందుబాటులోకి వస్తే, అతడి కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఏదేమైనా, ఈ విషయంపై రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అధికారికంగా స్పందించాల్సి ఉంది.