నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాల ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, కళాశాల ఆవరణలో రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా విద్యార్థులు వేసిన ముగ్గులతో కళాశాల ప్రాంగణమంతా పండగ శోభను సంతరించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థులు వేడుకలకు హాజరవ్వడంతో కళాశాలలో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె. సంపత్ కుమార్ మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మన జీవన విధానానికి ప్రతీకలని పేర్కొన్నారు. ప్రాచీన కళలను, పండగ విశిష్టతను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు.ఈ వేడుకల్లో ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎండీ సర్దార్, అధ్యాపకులు లత, రమాదేవి, భవాని, పద్మ, తిరుమల, జ్యోతి, ఇతర బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



