మరణానంతరం అవయవదాతల నుంచి సేకరించిన నేత్రాలను ఉచితంగా బస్సుల్లో తరలింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మరణానంతరం అవయవదాతల నుంచి సేకరించిన నేత్రాలను సకాలంలో ఆస్పత్రికి ఉచితంగా చేర్చేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ముందుకొచ్చింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీసీ) మధ్య ఒప్పందం కుదిరింది. సోమవారం సరోజినీ దేవి ఆస్పత్రిలో నిర్వహించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆ ఒప్పంద పత్రాలను టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినీ మార్చుకున్నారు. దీంతో ఇక నుంచి రాష్ట్రంలో ఏ మూలన సేకరించిన నేత్రాలనైనా సరే సకాలంలో ఆస్పత్రికి చేర్చేందుకు వీలు కలుగనున్నది. సేకరించిన నేత్రాలను ఆర్టీసీ వేగంగా ఆస్పత్రి ఐ బ్యాంకుకు చేరుస్తుంది. తద్వారా సేకరించిన నేత్రాలు ఐ బ్యాంకు రావడంలో జరిగే ఆలస్యంతో తలెత్తే నష్టాలకు ఫుల్‌స్టాప్ పడనున్నది. ఈ సందర్భంగా వారు నెట్‌వర్క్ ఆఫ్ సైట్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ప్రజా రవాణా వ్యవస్థలో ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. ప్రతి రోజు 60 లక్షల మంది ప్రజలను, 35 లక్షల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లేందుకు 50 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. సమాజంలో నేత్రదానంపై పూర్తిగా అపోహలు తొలగిపోలేదనీ, మరింత అవగాహన పెరగాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. నేషనల్ ప్రోగ్రాం కంట్రోల్ బ్లైండ్‌నెస్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.కళావతి బాయి మాట్లాడుతూ అంధత్వ నివారణకు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కార్నియల్ బ్లైండ్‌నెస్‌తో చాలా మంది బాధపడుతున్నారని తెలిపారు. నేత్రదానం అనేది మనిషి చనిపోయిన తర్వాత చేసేదనీ, దీనికోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సిద్ధిపేట మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత షా మాట్లాడుతూ నేత్రదాన ఉద్యమంలో ఆర్టీసీని కూడా భాగస్వామ్యం చేయడం పట్ల డాక్టర్ మోదినీని, సరోజినీ దేవి ఆస్పత్రి సిబ్బందిని అభినందించారు.
పలువురికి సన్మానం
నేత్రదానానికి ప్రోత్సాహాన్నిస్తున్న అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల సంఘం వ్యవస్థాప అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం శారదను ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు. ఆయనతో పాటు జీవన్ దాన్ చీఫ్ కో ఆర్డినేటర్ రియాజుద్దీన్ తదితరులను సత్కరించారు. అనంతరం పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. వివిధ జిల్లాల మెడికల్ కాలేజీల నుంచి వచ్చిన వారికి నేత్రాలను సేకరించి తరలించాల్సిన ఐస్ బాక్సులను అందజేశారు.
నేత్రదానం ప్రతిజ్ఞ చేసిన డాక్టర్ రాజారావు
ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజారావు తన నేత్రాలను దానం చేయనున్నట్టు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ప్రతిజ్ఞ పత్రాన్ని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదినీకి అందజేశారు. ప్రతి ఒక్కరు నేత్రదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.