అధికారికంగా ప్రకటించడమే తరువాయి
నవతెలంగాణ- విలేకరులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్లు భారీగా నమోదవ్వగా.. మరోవైపు ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక్కరే నామినేషన్ వేయడం, మరికొన్ని చోట్ల నామినేషన్ ఉపసంహరించుకోవడం.. గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ఉండటంతో ఏకగ్రీవాలు అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో 3 గ్రామ పంచాయతీలు, 11 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. చిక్కుడోని పల్లె, తిప్పా పూర్, కేశన్న పల్లె గ్రామాల పాలకమండళ్ల ఎన్నిక ఏకగ్రీవం అయ్యాయి. కొనరావుపేట మండలంలోని ఊరు తండా గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్ గ్రామ సర్పంచ్‌గా కనుక నాగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉండగా.. తర్వాత ఒకరు తప్పుకున్నారు. మెట్‌పల్లి మండలం చింతలపేట సర్పంచ్‌గా తోట్ల చిన్నయ్య యాదవ్ ఏకగ్రీవం అయ్యారు. సారంగపూర్ మండలం రంగపేట వడ్డెర కాలనీ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్లకు ఒక్కొక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవమైంది.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పీచుపల్లి గ్రామంలో సర్పంచ్, ఆరు వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్ రావడంతో పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం అయింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని తూర్పుగూడెం, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని మల్లారం, దుగునెల్లి గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. మర్రిగూడ మండలంలో కొట్టాల, చండూరు మండలంలో సొప్పరివారిగూడెం ఏకగ్రీవమయ్యాయి. మలుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రస్తుతం జరగబోయే 18 గ్రామ పంచాయతీలలో మూడు గ్రామపంచాయతీలను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్సాపూర్ యాపకళ, అంకంపల్లి ఇరుప వెంకటేశ్వర్లు, పంబాపూర్ ముక్తి శ్రీను ఎన్నిక ఏకగ్రీవం కాగా.. ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏకగ్రీవం అయిన అభ్యర్థులను మంత్రి సీతక్క సన్మానించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ సహా ఎనిమిది వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బుధవారం గ్రామస్తులు తెలిపారు. సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కేలోత్ వీరన్న ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు వార్డు సభ్యుల్లో సీపీఐ(ఎం) బలపరిచిన ముగ్గురు, బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన ఇద్దరు, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఇనుగుర్తి మండలంలోని రామతండా గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా భూక్య మిట్టు నాయక్, ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా.. ఉప సర్పంచ్ అభ్యర్థిగా దారావత్ వీరు నాయక్‌ను ఎన్నుకున్నారు. మిగతావారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపరిచిన నలుగురు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రేగొండ, గోరుకొత్తపల్లి మండలంలో నాలుగు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రేగొండ మండలంలోని గుడేపల్లి సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొలుగూరి రాజేశ్వరరావు, రేపాక గ్రామానికి గుల్ల స్వప్న తిరుపతి, గోరుకొత్తపల్లి మండలంలో బాలయ్యపల్లిలో తొట్ల తిరుపతి, చెంచుపల్లి గ్రామంలో జెల్ల రాము సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే రేగొండ మండల కేంద్రంలో ఆరు వార్డుల సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలంలోని దుర్గా నాయక్ తండా సర్పంచిగా బానోత్ అనూష యాకూబ్ ఏకగ్రీవం అయ్యారు. గ్రామంలో అనూష ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు.
సర్పంచులు.. వార్డు సభ్యుల ఏకగ్రీవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


