Monday, December 8, 2025
E-PAPER
Homeదర్వాజసాహిత్య సాధనంగా వ్యంగ్యం

సాహిత్య సాధనంగా వ్యంగ్యం

- Advertisement -

ప్రాచీన గ్రీకు హాస్య నాటకాలలో ఐరన్‌ (eiron)) అనే ఒక పురుష పాత్ర ఉండేది. ఈయన ఎంతో తెలివి గలవాడైనా తక్కువ తెలివి ఉన్నట్టు నటించి, ఎక్కువ తెలివి ఉన్నవాళ్ల లాగా మాట్లాడే డాంబిక పొగరుబోతు మందమతులను జయించేవాడు. ఇతడు కనబరచిన పద్ధతిని ఈరోనియా (eironeia) అంటారు. ఇదే ఐరనీ (irony) అనే పదానికి మూలం. ఈ ఈరోనియా అసలు విషయాన్ని దాచిపెట్టి, దానికి భిన్నమైనదాన్ని మాట్లాడటం లేదా రాయడంను సూచిస్తుంది. బాధ పెట్టకుండా, వాక్చాతుర్యాన్ని లేదా కళాత్మకతను సాధించడం ఇందులోని ప్రధాన ఉద్దేశం. అయితే, కొన్నిసార్లు పరోక్షమైన స్వల్ప అధిక్షేపం ఉండవచ్చు. వ్యంగ్యం పుట్టుక వెనుక ఇంత కథా కమామిషఉ ఉన్నాయి. సోక్రటీసు కూడా అజ్ఞానాన్ని నటించి, ఎదుటివారు చర్చను కొనసాగించేలా పురిగొల్పి, వారి తర్కంలోని లోపాలను వారు తెలుసుకునేలా చేసేవాడట. ఈ విధానాన్ని Socratic Irony అంటారు.

శబ్ద వ్యంగ్యం (verbal irony), పరిస్థితి పరమైన వ్యంగ్యం (situational irony), నాటకీయ వ్యంగ్యం (dramaticirony) అన్నవి వ్యంగ్యం లోని ప్రధానమైన రకాలు. అధిక్షేప/ ఎత్తిపొడుపు వ్యంగ్యం (sarcasm), హాస్యపూరిత వ్యంగ్యం (satire)) కూడా చెప్పుకోదగినవే. వీటిని వ్యంగ్యపు భిన్నరూపాలు (variants) గా ఎంచాలి. ట్రాజిక్‌ ఐరనీ, కాస్మిక్‌ ఐరనీ, రొమాటిక్‌ ఐరనీ మొదలైన మరికొన్ని చిన్నా చితకా రకాలున్నాయి. ఇవన్నీ వ్యంగ్యం అనే పెద్ద గొడుగు కిందికి వస్తాయి. అందుకే sarcasm ను, satire ను తెలుగులో ప్రత్యేకమైన వేరే పేర్లతో కాకుండా తరచుగా వ్యంగ్యం అనే వ్యవహరిస్తున్నారు. కానీ నిజానికి ఇవి ప్రాథమిక వ్యంగ్యానికి కొంచెం భిన్నమైనవి. ఆంగ్లభాషలో వ్యంగ్యం భిన్నమైన రూపాలతో, భిన్నమైన పేర్లతో ఉండటం వలన ఆ రకాలను తెలుగులో చెప్పేటప్పుడు కచ్చితత్వం కొంత కొరవడవచ్చు.

శబ్ద వ్యంగ్యంలో పదాలు బయటికి కనిపించే అర్థాలను కాకుండా భిన్నమైన అర్థాలను కలిగి ఉంటాయి. అబ్బ, ఎంత గొప్ప పని చేశావు! నీకు సన్మానం చేయాలి, అనే వాక్యంలో నిజానికి వ్యతిరేకమైన అర్థం దాగి ఉంది. నీ సామర్థ్యం నాకు తెలియదా?! అన్నప్పుడు, అందులో ప్రశంసకు బదులు అభిశంసన దాగి ఉండవచ్చు. దీన్నే నిందాస్తుతి అని కూడా అంటున్నాం.
పరిస్థితి పరమైన వ్యంగ్యంలో తక్కువ చేయడం, బాధ పెట్టడం ఉండదు. ఓ. హెన్రీ రాసిన ప్రసిద్ధ కథ The Gift of the Magi లో ఒక భార్య తన భర్తకు గొలుసును కొనేందుకు తన తలవెట్రుకలు అమ్ముతుంది. ఆ భర్త తన భార్య కోసం మంచి దువ్వెన కొనేందుకు తన చేతి గడియారాన్ని అమ్ముతాడు! మరొక చక్కని ఉదాహరణ చూడండి: ఎన్నో మెడికల్‌ డిగ్రీలు, డిప్లొమాలు పొందిన ప్రసిద్ధ హద్రోగ నిపుణుడు డాక్టర్‌ రుస్తుం జాల్‌ వకీల్‌ (1911 – 1974) ఇండియాలో ఐ.సి.సి.యు. ( Intensive Coronary Care Units ) ల స్థాపనకు అపారమైన కషి చేశాడు. కానీ, ఆయన ఒక ఐ.సి.సి.యు.లో రౌండ్స్‌ చేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయాడు! ఇదీ అసలైన situational irony అంటే.

నాటకీయ వ్యంగ్యంలో ఒక పాత్రకు సంబంధించిన రహస్యం ప్రేక్షకులకు తెలిసి వుంటుంది కానీ, ఇతర పాత్రలకు ఆ విషయం తెలియదు. మహా భారతం నాటకంలో కంకుభట్టు, వలలుడు మారువేషంలో ఉన్న ధర్మరాజు, భీముడు అని ప్రేక్షకులకు తెలుసు. కానీ విరాట రాజు, సుధేష్ణా దేవి మొదలైన ఇతర పాత్రలకు ఆ విషయం తెలియదు. ఇది నాటకీయ వ్యంగ్యానికి ఉదాహరణ.
ముందు చెప్పినట్టు sarcasm, satire లను ప్రాథమిక వ్యంగ్యానికి రూపాంతరాలుగా భావించాలి. మొదటిదానిలో బాధించాలనే దురుద్దేశం ఉంటుంది. రెండవదానిలో ప్రధానంగా హాస్యం చోటు చేసుకుంటుంది. గ్రీకు భాషలో sarkazein అనే క్రియాపదం ఒకటి ఉంది. దాని అర్థం చీల్చి చెండాడటం (to tear flesh). ఈ మాట నుండే sarcasm అన్న పదం పుట్టింది. రచనా పద్ధతిగా పేర్కొంటున్నప్పుడు సటైర్‌ ను హాస్య కావ్యం అని వ్యవహరించడమే సరైనది. సంభాషణ లోని ఒత్తి పలికే విధానం, దీర్ఘం తీయడం మొదలైనవి సటైర్‌ ను సులభంగా పట్టిస్తాయి.

ఇంగ్లిష్‌ నవలా రచయితలలో గోల్డ్‌ స్మిత్‌, ఆస్టెన్‌, థాకరేలు వ్యంగ్యాన్ని ఎక్కువగా వాడారు. స్విఫ్ట్‌ ఐతే అందులో ఆరితేరినవాడు. ఆంగ్ల కవులలో రాబర్ట్‌ బ్రౌనింగ్‌, లార్డ్‌ బైరన్‌, రాబర్ట్‌ బర్న్స్‌ పేర్లను చెప్పుకోవాలి. ఇక ఆంగ్ల కవిత్వంలో వ్యంగ్యం నిండిన పంక్తులను ఉదాహరించవలసి వస్తే, ఎస్‌.టి. కోలరిడ్జ్‌ కవితలోని Water, water everywhere,/ Nor any drop to drink” అందుకు చాలా అనువైనది. గుర్రమెక్కినవాడు గురువుగా కనిపించు, అనే వేమన పద్యపంక్తిలో కూడా వ్యంగ్యం ఉంది. ఇదే కాకుండా మరెన్నో వేమన పద్యాలు వ్యంగ్యాన్ని వెలయిస్తాయి. పానుగంటి వారి సాక్షి వ్యాసాలు, పురాణం సీత ‘ఇల్లాలి ముచ్చట్లు’ కూడా వ్యంగ్య రచనలకు చక్కని ఉదాహరణలు.
తెలుగు వచన కవిత్వంలో అక్కడక్కడ వ్యంగ్యానికి కొన్ని ఉదాహరణలు దొరుకుతాయి. నందిని సిధారెడ్డి రాసిన ‘కలిసి ఉంటే కలదు…’ అనే కవిత ఆసాంతం వ్యంగ్యంతో నిండివుంది. ఈ పంక్తులు చూడండి.
పిట్టలేమైనా కానీ, పిల్లలెట్లన్నా పోనీ/ మీరు మేఘాల దిక్కు చూడండి
మేం నదులు తన్నుకుపోతాం/ మనం కలిసి ఉందాం
మేం ఫాంహౌజులు పెడతాం/ మీరు వాచ్‌ మెన్లుగా చేరవచ్చు
మేం భారీ కాంట్రాక్టు తెస్తాం/ మీరు సబ్‌ కాంట్రాక్టులు చేసుకోవచ్చు
ఆదాబ్‌ హైదరాబాద్‌ శీర్షికతో రాసిన తన కవితను వ్యంగ్యంతో ప్రారంభిస్తారు లోచన్‌.
ఎంతైనా నువ్వు గ్రేట్‌/ నీ విజన్‌ గ్రేట్‌
హైద్రాబాద్‌ చుట్టూ అల్లుకున్న నీ అభిమానం గ్రేట్‌
మరి ఇప్పుడు నీ విదేశీగానంలో ఎన్ని గణాంకాలో
ఈ విధంగా వ్యంగ్యాన్ని ఒక శక్తిమంతమైన కవితా సాధనంగా ఉపయోగించుకోవచ్చు.

ఎలనాగ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -