Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeఎడిట్ పేజిసావర్కర్‌ : కట్టుకథలూ, చరిత్ర సత్యాలు

సావర్కర్‌ : కట్టుకథలూ, చరిత్ర సత్యాలు

- Advertisement -

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మీడియాలో పెట్టిన ఒక పోస్టు చాలా నిరసనకూ జుగుప్సకూ కారణమైంది. శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, షహీద్‌ భగత్‌సింగ్‌ల నాలుగు వదనాలను ఆ పోస్టు చిత్రించింది. అడుగున ”స్వాతంత్య్రం వారిచ్చిన కానుక-దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం” అని రాయడమే నిరసన తెచ్చిందని సులభంగానే అర్థమవుతుంది. బ్రిటిష్‌ వలస ప్రభుత్వం సావర్కర్‌ను అండమాన్‌లోని సెల్యూలార్‌ జైలులో నిర్బంధించినపుడు బయటికి రావడం కోసం కాళ్లావేళ్లాబడి క్షమాపణలు చెప్పడం బాగా తెలిసిందే. మళ్లీ 1948లో మహాత్మాగాంధీ హత్య కేసులో విచారణ కమిషన్‌ తనను దోషిగా నిర్ధారిస్తే కేవలం సాక్ష్యాలు లేవన్న సాంకేతిక కారణంతో కోర్టు విడిచి పెట్టింది. ప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుల సరసన బ్రిటిష్‌ వారితో కుమ్మక్కయిన ఒక తైనాతీకి, కుట్రదారుడికి చోటు కల్పించడం అంటే దిగ్భ్రాంతికరం. చరిత్రను తారుమారు చేయడమే అవుతుంది.2003లో వాజ్‌పేయి హయాంలో ఆయన చిత్రాన్ని పార్లమెంటులో ప్రతిష్టించారు. పోర్ట్‌ బ్లైర్‌ విమానాశ్రయానికి వీర సావర్కర్‌ పేరు పెట్టారు. ప్రధాని మోడీ, ఆయన మంత్రులు, బీజేపీ నేతలు సావర్కర్‌ భజన చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన జయంతి రోజున భరతమాత నిజమైన పుత్రుడుగా ఆయనను మోడీ కీర్తించారు. ముస్లింల పట్ల విషపూరిత విద్వేషం అనే సావర్కర్‌ సిద్ధాంతం ఆరెస్సెస్‌కు మూలం గనకనే ఇంతటి ఆరాధన. ఇలా సావర్కర్‌ను ఎప్పుడూ వీరోచితంగా చూపించడానికి ప్రధానమీడియా, సోషల్‌ మీడియాలు కూడా సంఘ పరివార్‌కు సాయమందిస్తున్నాయి.
రెండు దశలు
అత్యంత ముఖ్యమైన వాస్తవమేమంటే సావర్కర్‌ జీవితంలో రెండు విభిన్న దశలున్నాయి. అండమాన్‌ జైలులో నిర్బంధించబడటానికి ముందు అక్కడి నుంచి విడుదలైన తర్వాత. తొలి దశలో ఆయన ప్రధాన జాతీయోద్యమంపై అసహనంతో ఉన్న ఆవేశపూరిత యువకుడు. హత్యల వంటి వాటితో తొందరగా ఏదైనా నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని కోరుకున్న వ్యక్తి. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం (1857) చరిత్ర రాసి హిందూ సమాజాన్ని పీడిస్తున్న కుల విభజనలకు వ్యతిరేకంగా నిలిచినవాడు. ‘మిత్ర మేళా’ అనే రహస్య సంఘంలో చేరిన ఆయన తర్వాత తనే ‘అభినవ భారత్‌’ అనే మరో రహస్యసంస్థ స్థాపించాడు. పూణేలోని ఫెర్గూసన్‌ కాలేజీలో పట్టభద్రుడైన తర్వాత సావర్కర్‌ న్యాయశాస్త్రం చదివేందుకు లండన్‌ వెళ్లాడు. మాజినీ, గారిబాల్డి వంటి కుహనా జాతీయవాద ఇటాలియన్‌ నేతల ప్రభావంతో ప్రేరణ పొందాడు. లండన్‌లో ఉండగా 1909లో-భారత ప్రభుత్వ కార్యదర్శికి సహాయకుడుగా ఉన్న విలియం హట్‌కర్జన్‌ వైలీని హత్య చేయవలసిందిగా మదన్‌లాల్‌ డింగ్రా అనే యువ భారతీయ యువకుడ్ని ప్రోత్సహించాడు. ఈ పనిచేసిన డింగ్రాను బ్రిటిష్‌వారు ఉరితీశారు. సావర్కర్‌పైన కూడా అనుమానాలు వచ్చినా నిర్దిష్ట ఆధారాలు లభించలేదు. ఈలోగా సావర్కార్‌ సోదరుడైన గణేష్‌ బాంబులు నిల్వ చేసినందుకుగాను అరెస్టయ్యాడు. ఇందుకు ప్రతీకారంగా ‘అభినవ భారత్‌’లో మరో సభ్యుడైన అనంత ఖన్రే నాసిక్‌లో మేజిస్ట్రేట్‌ను కాల్చి చంపాడు. ఖన్రే తది తరులు అనేకమందిని అరెస్టు చేసినప్పుడు వారి దగ్గర సావర్కర్‌ రాసిన లేఖలు, లండన్‌ నుంచి పంపిన రివాల్వర్లు పట్టుబడ్డాయి. పోలీసులు లండన్‌కు ఒక అరెస్టు వారంటు పంపగా సావర్కర్‌ 1910 మార్చి 13న లొంగిపోయాడు. ఇండియాకు తీసుకు వస్తుండగా మార్సయిల్స్‌ రేవులో అతను ఓడ దూకి పారిపోయాడు. అతన్ని మళ్లీ అరెస్టు చేయగా ఫ్రాన్స్‌, ఇంగ్లాండులలో చాలా అలజడి రేగింది. ఆయన అభ్యర్థనలు చివరకు తోసివేయ బడగా ఇండియాకు తీసుకొచ్చారు. యాభైఏళ్ల జైలు శిక్షపడగా, పేరుమోసిన అండమాన్‌ జైలుకు 1911లో తరలించారు. సావర్కర్‌ జీవితంలోని ఈ దశనే మనకు స్కూలు పిల్లల పాఠాల్లో చెబుతుంటారు. అండమాన్‌ జైలుకు వెళ్లీ వెళ్లగానే సావర్కర్‌ బ్రిటిష్‌ పాలకులను క్షమాభిక్ష తతంగాన్ని మొదలెట్టాడు. 1911లో ఆయన సమర్పించుకున్న మొదటి పిటిషన్‌ ఇప్పుడు లేదుగాని దాని గురించిన ప్రస్తావన 1913 నవంబరు 14న ప్రభుత్వ హోంశాఖ సభ్యుడికి రాసిన రెండవ పిటిషన్‌లో వుంది.
దాసోహం! దాసోహం!
”అందువల్ల ప్రభుత్వము వారు అనేక విధాల నా యందు దయచూపి క్షమాగుణముతో వదలిపెట్టినట్టయితే నేను రాజ్యాంగ బద్దమైన ప్రగతికి అచంచలమైన మద్దతుదారుడుగానూ, అదే విధముగా అభివృద్ధికి తప్పనిసరి షరతుగా ఉన్న బ్రిటిష్‌ ప్రభుత్వము పట్ల విధేయుడుగానూ మాత్రమే మసలగలవాడను. మేము కారాగారముల్లో ఉన్నంత కాలము భారత దేశమున ఘనత వహించిన మహారాణిగారి పట్ల విధేయులైన పౌరుల జీవితాల్లో నిజమైన సంతోషము, హర్షము ఉండజాలవు. ఎందుకనగా మా బంధము అంత ధృఢతరమైనది. మేము గనక విడుదలయినట్టయితే ప్రజలు వెను వెంటనే సంతోషంతో ప్రభుత్వము పట్ల కృతజ్ఞతతో కేరింతలు కొట్టగలరు. వేధించడము, ప్రతీకారము కన్నా క్షమించడము సరిదిద్దడమే బాగా తెలిసిన వారు తమరు. అంతేగాక నేను గనక రాజ్యాంగ పంథాకు మారినట్టయితే భారతదేశంలోనూ విదేశములలోనూ దారితప్పిన యువజనులను తిరిగి సరైన దోవకు మరిలించగలను. వారందరూ ఒకప్పుడు నన్ను తమ గురువుగా, మార్గదర్శిగా నెంచెడువారు. నేను పూర్తి ఒప్పుదలతో ఈ మార్పును స్వీకరిస్తున్నాను గనక ప్రభుత్వమునకు వారుకోరిన ఏహోదాలోనైనను సేవ చేయుటకు సిద్ధముగా ఉన్నాను. ఆ విధముగా నా భవిష్యత్‌ ప్రవర్తన ఉండగలదని ఆశించుచున్నాను. నన్ను విడుదల చేసిన యెడల కలిగే ఫలితమునకు, నన్ను విడుదల చేయనిచో లభించేదానికి పోలికే ఉండజాలదు. మహా శక్తివంతులైన తమరు మాత్రమే దయామయులై వ్యవహరించగలరు. అందుచేత ప్రతిభా వంతుడైన ఈ కుమారుడు ఏలినవారి గుమ్మములోకి తప్ప మరెక్కడకు పోగలడు?” ‘పెనాల్‌ సెటిల్‌మెంట్స్‌ ఇన్‌ అండమాన్స్‌’ అన్న పేరిట ఆర్‌.సి. మజుందార్‌ 1975లో ప్రచురించిన పుస్తకం నుంచి తీసుకున్న భాగాలివి. కేంద్ర ప్రభుత్వ గజెటిర్స్‌ విభాగం వెలువరించిన ఈ పుస్తకం 211-214 పేజీల్లో ఉన్న ఈ భాగాలను 2020 మార్చి 23న మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానానికి అనుబంధంగా అందజేశారు. ఈ పిటిషన్‌లో సావర్కర్‌ వాడినభాష, తనను తాను అత్యంత విధేయుడుగా మార్చుకుని తెలివిగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించుకోవడం గమనించవచ్చు.
1920లో తనను భారత దేశానికి బదిలీ చేసి పూణేలోని ఎరవాడ జైలుకు తరలించే వరకూ సావర్కర్‌ మహజరులు సమర్పించుకుంటూనే వచ్చారు. చివరకు ఆయనను 1923లో విడుదల చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు పరిమితమై ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకూడదనే షరతు విధించారు. అండమాన్‌ జైలులో ఇతర ఖైదీలలాగే సావర్కర్‌ కఠోరమైన శ్రమకూ, హింసలకూ గురయ్యారు. ఘోరమైన ఆ పరిస్థితుల్లో కొందరు మరణించడం కూడా జరుగుతుండేది. అక్కడి నుంచి బయటికి రావాలని ఆయన కోరుకోవడం సహజమే. కానీ అక్కడున్న వందలాది మంది సమరయోధులు అష్టకష్టాలు భరిస్తుంటే సావర్కర్‌ మాత్రం అందుకోసం బ్రిటిష్‌ జైలర్ల దగ్గర తన నైతిక, సైద్ధాంతిక జాతీయ ఆంత:కరణాన్ని బేరం పెట్టడానికి కూడా సిద్ధమైపోయాడు. అలా ధైర్యంగా నిలబడిన వారిలో అగ్రగణ్యుడు భగత్‌సింగ్‌. ఆయన కూడా హింసాత్మక నిరసనను సాధనంగా చేసుకుని సహచరులతో పాటు జైలు పాలైనవారే. కానీ అక్కడ కూడా ఎన్నో పుస్తకాలు చదువుతూ, రాస్తూ బ్రిటిష్‌ పీడనకు గురవుతున్న వారందరి విముక్తి కోసం పరితపించారే తప్ప ఏనాడూ క్షమాపణ కోరలేదు. ఆయన్ను 1931లో 23 ఏండ్ల యువ ప్రాయంలోనే ఉరితీశారు.
విద్వేష రచన ‘హిందూత్వ’
తనపై విధించిన షరతుల ప్రకారం రత్నగిరి జిల్లాకు పరిమితమై వున్న కాలంలో సావర్కర్‌ విస్తారంగా నాటకాలు, వ్యాసాలు, కవితలు రాస్తూనే వచ్చారుగాని వాటిలో బ్రిటిష్‌ పాలకులపై విమర్శ మాయమైపోయింది. 1923లో మరాఠా అన్న కలం పేరుతో ఆయన రాసిన ‘హిందూత్వ’ పుస్తకంలోనే మొదటిసారి హిందూత్వ అనే భావజాలాన్ని ముందుకు తెచ్చారు. హిందూ మతం అన్నది పరాయి పాలకులు తెచ్చిపెట్టిందిగా కొట్టిపారేశారు. భారత చరిత్ర హిందూ ముస్లింల మధ్య ఘర్షణేననీ, ఈ యుద్ధాల క్రమంలోనే చరిత్రకు అందని కాలం నుంచి హిందువులు ఒక జాతిగా రూపొందారని చిత్రించారు. యూరప్‌లో తను వంట పట్టించుకున్న కుహనా జాతీయవాద భావాలను ఆపాదించుకుని హిందూ జాతి దేశంగా ఏర్పడాలని ప్రతిపాదించారు. హిందువులు ఒకే రక్తం కలిగివున్నారనీ, ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం ఉందని వాదించారు. హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు జాతులని ఎన్నటికీ కలసి మనజాలరని బల్లగుద్ది చెప్పారు. హింసారాధనను ప్రత్యేకించి ముస్లింలపై హింసా ప్రయోగాన్ని గొప్పగా చెబుతూ ఆ విధంగా మాత్రమే హిందూ మతం గుర్తింపు పొందగలదని ప్రకటించారు. ఈ పుస్తకమే 1928లో మరింత విస్తరించబడి ”హిందూత్వ: హు ఈజ్‌ ఎ హిందూ?” అనే పేరుతో వెలువడింది. ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడైన కె.బి.హెగ్డేవార్‌తో సహా ఎందరికో అదే తర్వాతి కాలంలో సైద్ధాంతిక వనరుగా మారింది. రెండవ సర్‌సంఫ్‌ు చాలక్‌ ఎం.ఎస్‌.గోల్వార్కర్‌ తన రచనల్లో ఈ భావాలను విస్తారంగా అరువు తీసుకున్నారు. 1937లో ఆయన కదలికలపై షరతులు ఉపసంహరించబడిన తర్వాత హిందూ మహాసభ అధ్యక్షుడైనాడు. ఆయన ఆధ్వర్యంలోనే మహాసభ బ్రిటిష్‌ వారిపై మెతక వైఖరి తీసుకుంది. యు.పి, బెంగాల్‌లలో ప్రభుత్వాల్లో భాగస్వామి అయింది. సాయుధ శిక్షణ లభిస్తుందనే సాకుతో హిందువులను రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ సైన్యంలో చేరవలసిందిగా ప్రోత్సహించింది. ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమానికి దూరంగా వుండిపోవడమేగాక దానిపై అణచివేతకు కూడా సహకరించింది. హిందూ మహాసభకు చెందిన శ్యాంప్రసాద్‌ముఖర్జీనే తర్వాత జనసంఘం స్థాపించాడు. ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమ కాలంలో బెంగాల్‌లో ఫజల్‌ అలీ మంత్రివర్గంలో సభ్యుడుగా ఉన్నాడు.
1948 జనవరిలో మహాత్మా గాంధీ హత్య తర్వాత సావర్కర్‌పై అనుమానంతో అరెస్టు చేశారు. ”సావర్కర్‌ కింద నేరుగా పనిచేసే ఉన్మాద పూరిత సంస్థ హిందూ మహాసభనే హత్యకు కుట్ర పన్నింది, అమలు చేసింది” అంటూ హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ నెహ్రూకు వివరంగా రాశారు (సర్దార్‌ పటేల్‌ ఉత్తర ప్రత్యుత్తరాలు 1944-50-దుర్గా దాస్‌ సంకలనం, ఆరవ సంపుటం). తర్వాత పటేల్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీకి ఆ ఘటనలో సావర్కర్‌ హిందూ మహాసభ, ఇంకా వారికి సంబంధించిన ఇతరుల పాత్ర గురించి కూడా రాశారు (అదే సంపుటం 66,303 పేజీలు). 1965లో జస్టిస్‌ జీవన్‌లాల్‌ కపూర్‌ అధ్యక్షతన నెలకొల్పిన విచారణ కమిషన్‌ సావర్కర్‌ సన్నిహితులైన ఎ.పి.కసార్‌, జి.వి దామీల వాంగ్మూలం తీసుకున్నది. సావర్కర్‌, అతని బృందం మహాత్మా గాంధీ హత్యకు కుట్ర జరిపిందని తప్ప మరో నిర్ణయానికి వచ్చే అవకాశమే లేదని ఆ కమిషన్‌ నివేదిక 303 పేజీ, 25-106 పేరాల మధ్యలో స్పష్టంగా చెప్పింది.
భయంకర భావజాలం
గాంధీ హత్యకేసులో శిక్ష తప్పినా సావర్కర్‌ కళంకం మాసిపోలేదు. హిందూ మహాసభ తనను తాను రద్దు చేసుకుంది. ఆ విచారణలోని ఇతర కుట్రదారులకు దూరంగా మెలిగాడు. మళ్లీ తనను నిర్బంధిస్తారనే భయం అతన్ని వెంటాడింది. జీవితంలో చివరికాలం అనామకంగా గడిపాడు. ‘సిక్స్‌ గ్లోరియస్‌ ఎపోక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ హిస్టరీ’ పేరిట తన అతి కీలకమైన రచన పూర్తి చేశాడు. 1963లో అది ప్రచురితమైంది. తర్వాత ఆహార పానీయాలు మానేసి మరో మూడేళ్లలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ పుస్తకం హిందూ జాతి విదేశీ ఆధిపత్యం నుంచి విముక్తి పొందిన కాలానికి సంబంధించిన చరిత్రను చెబుతుందన్నాడు. విదేశీ మత విశ్వాసాలు అన్న వాటిపై ఆ పుస్తకంలో విద్వేషం కూరాడు. హిందువులు మెతకగా వుండి బానిసత్వానికి లోబడిపోయారన్నాడు. ముస్లిం మహిళలపై మానభంగాలు చేయలేదనీ, ఊచకోత కోయలేదనీ, మసీదుల విధ్వంసానికి పాల్పడలేదని తిట్టిపోశాడు. ఈ పద్ధతిలో వ్యవహరించిన కొంతమంది వీరులను తీసుకుని వారు హిందూ మతం ఖ్యాతి నిలపడం కోసం ఆ మార్గం చేపట్టాలని నొక్కి చెప్పాడు. చాలా భయావహమైన, అమానుషమైన నైతికతను ఈ పుస్తకంలో సావర్కర్‌ ప్రబోధించాడు. హిందూ జాతికి మేలు చేస్తుందా లేదా అన్నదే కొలబద్దగా చేసుకుని ముస్లిం మహిళలను మానభంగాలు చేయడం, మతంలో కలుపుకోవడం ద్వారా హిందూ జాతి పెరుగుతుంది గనక అది మంచిదన్నాడు. ఈ రోజుకూ ఆరెస్సెస్‌ శ్రేణులు సావర్కర్‌నే సమర్థిస్తారు. నేటి హిందూత్వ దళాలను అమితంగా ప్రభావితం చేస్తున్నది ఈ పుస్తకం సారాంశమే. కానీ ఆయన రచనలకూ జీవితానికి చేసిన పనికీ స్వాతంత్య్ర పోరాటంతో ఏ విధంగానూ సంబంధం లేకపోగా ఆయన బ్రిటిష్‌ వారి వైపే ఉన్నాడు. రాజ్యాంగం చెప్పే లౌకికతత్వం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం అనే విలువలకు కూడా ఆయన వ్యతిరేకి!

– సవేరా

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad