నవతెలంగాణ -బోధన్
భారతీయ తొలి మహిళ ఉపాధ్యాయురాలుగా పేరుగాంచిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను బోధన్ మండలంలోని సాటాపూర్ ఎంపీయూపీఎస్‌లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి హెచ్ఎం రవి పూల మాలవేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి అక్షర జ్ఞానంతోనే సాధ్యపడుతుందని, మహిళల విద్యాభ్యాసానికి విశేష కృషి చేసిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కుతుందన్నారు. సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు ఆదర్శమన్నారు.
ఆమె బాలికా విద్యను ప్రోత్సహించి సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. భారత ప్రభుత్వం మహిళలకు విద్య సమూపార్జనలో చేసిన సేవలకు గాను సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందని అన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిని ఉపాధ్యాయుల బృందం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ట్రైనీ టీచర్లు హెచ్ఎంకు పూల బొకేను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీకాంత్, గంగారాం, ట్రైనీ టీచర్లు గాయత్రి, ప్రవళిక, అశ్విత, హర్షిత, జ్ఞానేశ్వరీ, విద్యార్థులు పాల్గొన్నారు.



