జనవరి 10న తుది జాబితా ప్రచురణ : సర్క్యులర్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 117 మున్సిపాల్టీలకు సంబంధించి అన్ని వార్డుల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం కమిషనర్ రాణి కుముదిని సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 30న పోలింగ్ స్టేషన్ల వారీగా డేటాను తిరిగి అమర్చాలనీ, 31న వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల సమాచారం పున్ణవ్యవస్థీకరించడం, అదే రోజు పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల రోల్స్‌లో డేటాను చేర్చాలని పేర్కొంది. జనవరి 1న పేర్లు, చిరునామాలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం నోటీసు బోర్డులపై పోలింగ్‌స్టేషన్ల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 5న యూఎల్బీ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపాల్టీ, కార్పొరేషన్ కమిషనర్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు. 6న జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారుల సమీక్ష జరుగుతుంది. అనంతరం జనవరి 10న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తారు.



