తప్పిన పెను ప్రమాదం
ఖమ్మం జిల్లా బోనకల్‌లో ఘటన
నవతెలంగాణ – బోనకల్
ఆగి ఉన్న ఆటోను స్కూల్ బస్ ఢీ కొట్టిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెంలో గురువారం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు ప్రాణాలనుంచి బయటపడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నల్లపు నరసింహారావు గృహ వస్తువులను అమ్ముకునే వారికి కిరాయి నిమిత్తం గురువారం ఉదయం చొప్పకట్లపాలెం వచ్చాడు. గ్రామంలో వారు వస్తువులు అమ్ముకుంటుండగా నరసింహారావు ఆటోను రోడ్డు పక్కన ఉంచి ఆటోలోనే కూర్చొని ఉన్నాడు. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలోని ఓ ప్రయివేటు హైస్కూల్ బస్సు చిరు నోములలో విద్యార్థులను ఎక్కించుకొని చొప్పకట్లపాలెం బయలుదేరింది. చొప్పకట్లపాలెం గ్రామం ముందు ప్రధాన రహదారికి అడ్డంగా గాడి ఉంది.
ఆ గాడిలో బస్సు దిగగానే బస్సు కమాన్ కట్ట విరిగింది. దాంతో బస్సు స్టీరింగ్ (స్టక్) పట్టుకుపోవడంతో ఎడమ వైపు వెళ్లాల్సిన బస్సు పూర్తిగా కుడివైపు వేగంగా వెళ్లి ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఆటోలో ఉన్న డ్రైవర్ నరసింహారావు ఆటోలోనే ఇరుక్కుపోయాడు. వెంటనే స్థానికులు స్పందించి ఆటోలో నుంచి డ్రైవర్‌ను బయటకు తీయటానికి సుమారు అర్థగంట పాటు శ్రమించారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ముఖానికి తీవ్ర గాయాలు కాగా కాలు విరిగింది. బస్సు ముందు భాగం కూడా దెబ్బతిన్నది. ప్రమాదానికి గురైన బస్సు ఆటోని ఢీ కొట్టి ఓ ఇంటు ప్రహరీ గోడ వరకు వెళ్లి ఆగిపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు ప్రమాదానికి గురైన సంఘటన తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



