Saturday, December 6, 2025
E-PAPER
Homeఆటలుతీరంలో తాడోపేడో

తీరంలో తాడోపేడో

- Advertisement -

భారత్‌, దక్షిణాఫ్రికా మూడో వన్డే నేడు
సిరీస్‌ విజయంపై ఇరు జట్లు గురి
మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

తెంబ బవుమా సారథ్యంలో రికార్డులు ఛేదిస్తూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న దక్షిణాఫ్రికా.. నేడు విశాఖపట్నంలో మరో అరుదైన రికార్డుపై కన్నేసింది. 1986-87 తర్వాత భారత్‌ స్వదేశీ టూర్‌లో వరుస సిరీస్‌ పరాజయాలు చవిచూడలేదు. విశాఖ వన్డే విజయంతో సఫారీ డబుల్‌ ధమాకా సాధించాలని చూస్తోంది. విరాట్‌ కోహ్లి హ్యాట్రిక్‌ సెంచరీ ముంగిట నిలువగా.. తీరంలో తాడోపేడో తేల్చుకునేందుకు భారత్‌ సై అంటోంది. విశాఖలో విజయంతో సఫారీలకు ఓటమితో ముగింపు పలకాలని భారత్‌ ఎదురుచూస్తోంది. విశాఖలో నేడు భారత్‌, దక్షిణాఫ్రికా ఆఖరు వన్డే.

నవతెలంగాణ-విశాఖపట్నం
2021-22 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ చివరగా ఓ టూర్‌లో రెండు సిరీస్‌ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలె 1986-87 తర్వాత ఓ టూర్‌లో ఎన్నడూ వరుస సిరీస్‌ ఓటములు చూడలేదు. సొంతగడ్డపై తిరుగులేని రికార్డుల పరంపరంతో ప్రత్యర్థులను శాసించిన భారత్‌… నేడు విశాఖలో భిన్నమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. పాతికేళ్లలో తొలిసారి సఫారీలకు టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ సుమారు 40 ఏండ్ల తర్వాత స్వదేశీ టూర్‌లో వరుస సిరీస్‌ పరాజయాల ప్రమాదంలో ఉంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రాంచీలో భారత్‌, రారుపూర్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. విశాఖపట్నంలో నేడు సిరీస్‌ నిర్ణయాత్మక పోరు.

విరాట్‌ హ్యాట్రిక్‌ కొట్టేనా? :
విశాఖపట్నం విరాట్‌ కోహ్లి ఫేవరేట్‌ స్టేడియాల్లో ఒకటి. ఇక్కడ విరాట్‌ కోహ్లి సగటు 97.83. స్ట్రయిక్‌రేట్‌ వందకు పైనే. కోహ్లి కెరీర్‌లో 11 పర్యాయాలు వరుస సెంచరీలు సాధించాడు. ఓసారి వరుసగా మూడు శతకాలు కొట్టాడు. రాంచీ, రారుపూర్‌లో శతకాలు సాధించిన కోహ్లి.. నేడు అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలో హ్యాట్రిక్‌ సెంచరీ కొట్టేందుకు సిద్దమవుతున్నాడు. అభిమానులు సైతం కోహ్లి మేనియా కోసం స్టేడియానికి తరలి రానున్నారు. ఓపెనర్లలో రోహిత్‌ శర్మ టచ్‌లో ఉన్నాడు. అమ్మమ్మ ఊరు విశాఖలో తనదైన భారీ ఇన్నింగ్స్‌ బాదేందుకు రోహిత్‌ సైతం రెడీ అవుతున్నాడు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ దూకుడుగా ఆడుతున్నా… నిలకడగా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది.

నేడు విశాఖలో యశస్వి విఫలమైతే.. మూడో ఓపెనర్‌గా వరల్డ్‌కప్‌కు వెళ్లేది అనుమానమే. నాల్గో స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ గత మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. వాషింగ్టన్‌ సుందర్‌ లోయర్‌ ఆర్డర్‌లో కీలక స్థానంలో ఆడతున్నాడు. కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ సైతం ఫామ్‌లో ఉన్నాడు. దీంతో బ్యాటింగ్‌ లైనప్‌లో భారత్‌కు పెద్దగా కష్టాలు లేవు. బౌలింగ్‌ విభాగంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రానా, ప్రసిద్‌ కష్ణలు సమిష్టిగా మెరుస్తున్నా… రెండు సార్లు మంచు ప్రభావంలో బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. నేడు మధ్యాహ్నం బౌలింగ్‌ చేసే అవకాశం వస్తే పేస్‌ త్రయం మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతుంది. స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌తో కలిసి వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజాలు స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.

సఫారీలు సాధిస్తారా? :
దక్షిణాఫ్రికా బవుమా సారథ్యంలో ఎన్నో ఘనతలు సాధించింది. భారత్‌లో పాతికేళ్ల తర్వాత తొలి టెస్టు సిరీస్‌ విజయం సాధించి… ఈ టూర్‌లో అరుదైన డబుల్‌ ధమాకా ముంగిట నిలిచింది. సఫారీ శిబిరంలో మార్కో యాన్సెన్‌ ఆల్‌రౌండర్‌గా రాటుదేలుతున్నాడు. బంతితో, బ్యాట్‌తో అతడిని నిలువరించటం సవాల్‌గా మారుతోంది. నేడు కొత్త బంతితో రోహిత్‌, కోహ్లికి సవాల్‌ విసిరే అవకాశం దక్కించుకోనున్న యాన్సెన్‌.. కొత్తగా ఏం చేస్తాడో చూడాలి. భారత్‌పై మంచి రికార్డున్న క్వింటన్‌ డికాక్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌లు ఆశించిన ప్రదర్శన చేయలేదు. నేడు ఈ ఇద్దరు రాణిస్తే సఫారీ టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ కష్టాలు తీరినట్టే. టోనీ, బర్గర్‌ గాయంతో విశాఖ వన్డేకు దూరమైనా.. సఫారీ శిబిరంలో విజయోత్సాహం తగ్గలేదు. బవుమా నేడు విశాఖలో మరో వండర్‌ సష్టిస్తాడా? చూడాలి.

పిచ్‌, వాతావరణం :
విశాఖలో జరిగిన గత రెండు వన్డేల్లో భిన్నమైన గణాంకాలు నమోదయ్యాయి. 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ 387 పరుగుల భారీ స్కోరు చేయగా.. 2023 మార్చిలో ఆస్ట్రేలియా చేతిలో 117 పరుగులకే కుప్పకూలింది. విశాఖ పిచ్‌లో ఎటువంటి మార్పులు కనిపించటం లేదు. దీంతో నేడు డిసైడర్‌లో పరుగుల వరద పారేందుకు అవకాశం మెండు. మంచు ప్రభావంతో టాస్‌ నెగ్గిన తొలుత బౌలింగ్‌ ఎంచుకునే వీలుంది.

తుది జట్లు (అంచనా):
భారత్‌ : యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రానా, కుల్‌దీప్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్‌ కృష్ణ.
దక్షిణాఫ్రికా : ఎడెన్‌ మార్‌క్రామ్‌, క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), తెంబ బవుమా (కెప్టెన్‌), మాథ్యూ బ్రిట్జ్కె, రియాన్‌ రికెల్టన్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాచ్‌, కేశవ్‌ మహరాజ్‌, లుంగి ఎంగిడి, బార్ట్‌మాన్‌.

టాస్‌ కీలకం : భారత్‌లో ఈ సమయంలో రాత్రి వేళ మంచు కురుస్తుంది. మంచు కురిసే సమయంతో బంతి మెత్తబడుతుంది. తడితో బంతిపై బౌలర్లపై పట్టు చిక్కదు. ఫలితంగా లైన్‌, లెంగ్త్‌ లయ తప్పుతుంది. దీంతో బ్యాటర్లు అలవోకగా పరుగులు సాధించేందుకు వీలుంటుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ తర్వాత భారత్‌ మళ్లీ వన్డేలో టాస్‌ నెగ్గలేదు. వరుసగా 20 టాస్‌లు ఓడిన భారత్‌.. నేడు విశాఖలో మరోసారి టాస్‌పై ఆశలు పెట్టుకుంది. మంచు ప్రభావం వేళ తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు పరుగుల వేట కాస్త కష్టంగా ఉంటుంది. బౌలర్ల కష్టం రెట్టింపు అవుతుంది. అదే టాస్‌ నెగ్గితే..రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అనుకూలత ఉంటుంది. రాంచీలో టాస్‌ ఓడినా భారత్‌ బ్యాట్‌, బంతితో చెమటోడ్చింది. రారుపూర్‌లో టాస్‌ ఓడి బ్యాట్‌తో మెరిసినా… బంతితో కష్టపడినా ఫలితం దక్కలేదు. మరి, నేడు విశాఖపట్నంలో ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -